బాలయ్య ఆ సినిమా చెయ్యట్లేదు!
on Feb 1, 2020
జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా బాలకృష్ణ చెయ్యనున్నాడా?.. ఇది లేటెస్టుగా నెట్టింట జోరుగా ప్రచారంలోకి వచ్చిన వార్త. త్రివిక్రమ్ డైరెక్షన్లో తారక్ ఓ సినిమా చెయ్యనున్న విషయం తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్లో చేస్తోన్న 'ఆర్ఆర్ఆర్' మూవీ తర్వాత త్రివిక్రమ్ తో పనిచెయ్యాలని ఇప్పటికే తారక్ నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించి స్క్రిప్టుకు త్రివిక్రమ్ ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఒక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందనీ, అందులో హీరో ఫాదర్ క్యారెక్టర్ కోసం బాలకృష్ణను త్రివిక్రమ్ సంప్రదించాడనే ప్రచారం శుక్రవారం గుప్పుమంది. బాలకృష్ణ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది ఆ ప్రచార సారాంశం.
అయితే తెలుగుఒన్ పరిశీలనలో ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలింది. ఇవి కావాలని ఎవరో పుట్టించిన రూమర్స్ అనీ, తన సినిమాలోని ఏ క్యారెక్టర్ కోసం కూడా బాలకృష్ణను త్రివిక్రమ్ సంప్రదించలేదని ఆయన సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. అందువల్ల తారక్ తండ్రిగా బాలకృష్ణ కనిపిస్తాడనే ప్రచారంలో అర్థమే లేదని అవి తెలిపాయి. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.