పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య.. అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్!
on Oct 31, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేసే అవకాశముందని కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో ప్రసారమవుతున్నప్పటి నుంచే ఆయనతో నిర్మాత అల్లు అరవింద్ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వినిపించింది. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరనే దానిపై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే అల్లు అరవింద్ నిర్మాణంలో బాలయ్య నటించే సినిమాకి దర్శకుడు ఎవరో తాజాగా క్లారిటీ వచ్చేసింది.
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. నవంబర్ 4న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరగగా బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకుడు పరశురామ్ 'జై బాలయ్య' అంటూ తన స్పీచ్ ని ప్రారంభించి.. ఒక సర్ ప్రైజింగ్ న్యూస్ ని రివీల్ చేశాడు. "సార్ ఒక అద్భుతమైన కథతో త్వరలోనే మిమ్మల్ని కలవబోతున్నాం.. అల్లు అరవింద్ గారికి కూడా తెలుసు" అంటూ పరశురామ్ వేదిక ముందు కూర్చున్న బాలకృష్ణతో చెప్పాడు. దీంతో పరశురామ్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా అల్లు అరవింద్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడన్న విషయం స్పష్టమైంది.
గీతా ఆర్ట్స్ లో పరశురామ్ ఇప్పటికే 'శ్రీరస్తు శుభమస్తు', 'గీత గోవిందం' సినిమాలు చేయగా ఆ రెండూ విజయం సాధించాయి. ముఖ్యంగా 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే పరశురామ్ మీద నమ్మకంతో బాలయ్య కోసం ఓ అద్భుతమైన కథ తయారు చేయమని అరవింద్ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న 'వీర సింహా రెడ్డి' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఆ తర్వాత పరశురామ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



