ప్రభాస్, రామ్ చరణ్ అలా.. యశ్, ఎన్టీఆర్ ఇలా!
on Oct 12, 2022

'బాహుబలి' ఫ్రాంచైజ్ తో ప్రభాస్, 'కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తో యశ్ పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించారు. అలాగే 'ఆర్ఆర్ఆర్'తో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారారు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చాక సినిమాలు చేసే విషయంలో ప్రభాస్, చరణ్ ఓ దారిలో వెళ్తుంటే.. యశ్, ఎన్టీఆర్ మరో దారిలో వెళ్తున్నారు.
'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలు చేసి నిరాశపరిచాడు. వచ్చే సంక్రాంతికి 'ఆదిపురుష్'తో అలరించడానికి సిద్ధమవుతున్న ప్రభాస్ చేతిలో 'సలార్', 'ప్రాజెక్ట్-k'తో పాటు మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఉన్నాయి. అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' అనే చిత్రాన్ని కూడా ప్రకటించాడు. 'బాహుబలి' తర్వాత చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ వేగంగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ సైతం ప్రభాస్ దారిలోనే వెళ్తున్నట్టు అనిపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన కొద్దిరోజులకే తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన 'ఆచార్య'తో పలకరించి ఘోర పరాజయాన్ని చూశాడు చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న 'RC 15' ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. 2023 వేసవికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రకటించాడు చరణ్. మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి.
ప్రభాస్, చరణ్ ల దారి ఒకలా ఉంటే యశ్, ఎన్టీఆర్ ల దారి మరోలా ఉంది. 'కేజీఎఫ్' సినిమాలోని "తొందరపడితే చరిత్రను తిరగ రాయలేం" అనే డైలాగ్ ని వీరిద్దరూ ఫాలో అవుతున్నట్టున్నారు. పాన్ ఇండియా స్టార్లుగా మారాక ప్రభాస్, చరణ్ చేసిన సినిమాలు ప్లాప్ అయిన నేపథ్యంలో వీరిద్దరూ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. 'లేట్ గా వచ్చినా పర్లేదు, హిట్ కొట్టి తీరాలి' అన్నట్టుగా వీళ్ళ తీరు ఉంది. 'కేజీఎఫ్-2' వచ్చి ఆరు నెలలు దాటుతున్నా ఇంతవరకు యశ్ కొత్త సినిమా మొదలుపెట్టలేదు. కనీసం అధికారిక ప్రకటన కూడా రాలేదు. తన తదుపరి సినిమా 'కేజీఎఫ్'ని మించేలా ఉండాలన్న ఉద్దేశంతోనే యశ్ ఇంత సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇంచుమించు యశ్ లాగే ఉంది. 'ఆర్ఆర్ఆర్' వచ్చి ఆరు నెలలు దాటింది. కొరటాల శివ దర్శకత్వంలో 'ఎన్టీఆర్ 30', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్ 31' ప్రకటించాడు కానీ.. ఇంతవరకు 'ఎన్టీఆర్ 30' మొదలే కాలేదు. 'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాటు, 'ఆచార్య' వంటి డిజాస్టర్ తరువాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో 'ఎన్టీఆర్ 30' స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే ప్రాజెక్ట్ ఆలస్యానికి ప్రధాన కారణమని సమాచారం.
మరి 'నిదానమే ప్రధానం' అన్నట్టుగా నెమ్మదిగా సినిమాలు చేస్తున్న యశ్, ఎన్టీఆర్ 'లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాం' అంటూ పాన్ ఇండియా స్టార్స్ గా మారాక చేసే సినిమాలతో విజయాలు అందుకుంటారో లేక ఆలస్యంగా వచ్చి కూడా ప్రభాస్, చరణ్ ల పరాజయాలనే ఎదుర్కొంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



