ENGLISH | TELUGU  

తిక‌మ‌క క‌థ‌నం‌.. 'ఓ పిట్ట క‌థ' మూవీ రివ్యూ

on Mar 6, 2020

సినిమా పేరు: ఓ పిట్ట క‌థ‌
తారాగ‌ణం:  విశ్వంత్ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యా శెట్టి, బ్ర‌హ్మాజీ, బాల‌రాజు, శ్రీ‌నివాస్ భోగిరెడ్డి, భ‌ద్రాజీ, ర‌మ‌ణ చ‌ల్క‌ప‌ల్లి, సిరిశ్రీ‌, సూర్య ఆకొండి
పాట‌లు: శ్రీ‌జో
సంగీతం: ప‌్ర‌వీణ్ ల‌క్క‌రాజు
సినిమాటోగ్ర‌ఫీ:  సునీల్ కుమార్ ఎన్‌.
ఎడిటింగ్‌:  డి. వెంక‌ట‌ప్ర‌భు
ఆర్ట్‌:  వివేక్ అన్నామ‌లై
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: అన్నే ర‌వి
నిర్మాత‌:  వి. ఆనంద ప్ర‌సాద్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  చెందు ముద్దు
బ్యాన‌ర్‌: భ‌వ్య క్రియేష‌న్స్‌
విడుద‌ల తేదీ: 6 మార్చి 2020

చిరంజీవి మొద‌లుకొని మ‌హేశ్‌, ప్ర‌భాస్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాని, రానా, త్రివిక్ర‌మ్‌, రామ్‌గోపాల్ వ‌ర్మ‌, పూరి జ‌గ‌న్నాథ్‌, కొర‌టాల శివ‌, హ‌రీశ్ శంక‌ర్‌, అనిల్ రావిపూడి.. ఇలా ఎంతోమంది మ‌హామ‌హులు స‌పోర్ట్ చేసిన సినిమాగా ఓ పిట్ట క‌థ కొన్ని రోజులుగా వార్త‌లో నిలుస్తూ వచ్చింది. కార‌ణం.. ఇందులో సీనియ‌ర్ యాక్ట‌ర్ బ్ర‌హ్మాజీ కొడుకు సంజ‌య్ రావు హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌టం. బ్ర‌హ్మాజీ కోస‌మే వాళ్లంతా ఓ పిట్ట క‌థ కోసం నిల‌బ‌డ్డారు. దాంతో చెందు ముద్దు అనే ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తూ భ‌వ్య క్రియేష‌న్స్ నిర్మించిన ఈ సినిమా కోసం జ‌నం ఆస‌క్తిగా ఎదురుచూశారు. విడుద‌ల‌కు ముందు హంగామా చేసిన ఆ సినిమా ఎలా ఉందంటే...

క‌థ‌:
ఒక అంద‌మైన ప‌ల్లెటూళ్లో వెంక‌ట‌ల‌క్ష్మి (నిత్యా శెట్టి) అనే యువ‌తి అర‌కు అందాల‌ను ఆస్వాదించేందుకు వెళ్లి కిడ్నాప్‌కు గుర‌వుతుంది. ఆమె క‌నిపించ‌డం లేద‌ని తండ్రి వీర్రాజు, బావ క్రిష్ (విశ్వంత్‌) పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేస్తారు. ఇన్‌స్పెక్ట‌ర్ (బ్ర‌హ్మాజీ) ద‌ర్యాప్తు ప్రారంభిస్తాడు. ఆమెపై వీర్రాజుకు చెందిన వెంక‌ట‌ల‌క్ష్మి థియేట‌ర్‌లో ప‌నిచేసే ప్ర‌భు (సంజ‌య్ రావు) క‌న్నేశాడ‌ని క్రిష్ చెప్తాడు. అప్పుడే వెంక‌ట‌ల‌క్ష్మిసెల్‌ఫోన్ దొరుకుతుంది. అందులో ఆమెను కారులోంచి లోయ‌లోకి ఒక ముసుగు మ‌నిషి తోసేసిన‌ట్లు, కారు బ్లాస్ల్ అయి వెంక‌ట‌లక్ష్మి చ‌నిపోయిన‌ట్లు వీడియో ఫుటేజ్‌ క‌నిపిస్తుంది. ప్ర‌భును ప‌ట్టుకుంటాడు ఇన్‌స్పెక్ట‌ర్‌.  కానీ తాను, వెంక‌ట‌ల‌క్ష్మి ప్రేమించుకున్నామ‌ని, అలాంటిది తానెందుకు ఆమెను చంపుతాన‌ని ప్ర‌భు చెప్ప‌డంతో ఇన్‌స్పెక్ట‌ర్ అయోమ‌యంలో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత క‌థ అనేక మ‌లుపులు తిరుగుతుంది. సెల్‌ఫోన్‌లో ఉన్న వీడియో ఫుటేజ్ నిజ‌మైన‌దేనా?  వెంక‌ట‌ల‌క్ష్మి ఏమైంది? ఆమె అదృశ్యం వెనుక ఉన్న‌ది ఎవ‌రు? ప‌్ర‌భు అమాయ‌కుడా?.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చివ‌ర‌లో ల‌భిస్తుంది.

విశ్లేష‌ణ‌:
ఓ పిట్ట క‌థ అనేది స్క్రీన్‌ప్లేపై ఆధార‌ప‌డి న‌డిచే సినిమా. మూడు వెర్ష‌న్స్‌లో క‌థ‌ను న‌డిపాడు ద‌ర్శ‌కుడు చెందు. ఒక వెర్ష‌న్.. ప్రేక్ష‌కుల‌కు ద‌ర్శ‌కుడు చూపించేది అయితే, ఇంకో వెర్ష‌న్‌.. క్రిష్ చెప్పే వ్యూ నుంచి న‌డుస్తుంది. మ‌రో వెర్ష‌న్‌.. ప్ర‌భుది. అంటే మ‌నం ఒకే ర‌క‌మైన స‌న్నివేశాల్ని మూడు సార్లు, మూడు దృక్కోణాల నుంచి చూడాల‌న్న మాట‌. ఇది సాధార‌ణ ప్రేక్ష‌కుడికి చాలా తిక‌మ‌క క‌లిగించే వ్య‌వ‌హారం. మ‌నం ఒక‌ట‌నుకున్న‌ది నిజం కాద‌ని, ఇంకో వెర్ష‌న్‌, అది కూడా నిజం కాద‌ని మ‌రో వెర్ష‌న్ రావ‌డంతో మెద‌డుకు పెద్ద ప‌నే ప‌డుతుంది. అర్థం చేసుకున్న‌వాళ్ల‌కు ఫ‌ర్వాలేదు కానీ, అర్థం కానివాళ్ల‌కు త‌ల‌నొప్పి రావ‌డం గ్యారంటీ. 

మొద‌టి అర‌గంట సినిమాలో ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల్ని క‌ల్పించిన తీరు, డైలాగ్స్ అప‌రిప‌క్వంగా అనిపిస్తాయి. ఆ త‌ర్వాత క‌థ ఆస‌క్తిక‌ర ద‌శ‌లోకి వెళ్తుంది. క‌థ‌లో మ‌న‌కు ప్ర‌ధానంగా నాలుగు పాత్ర‌లు క‌నిపిస్తాయి. వెంక‌ట‌ల‌క్ష్మి, ఆమె తండ్రి వీర్రాజు, క్రిష్‌, ప్ర‌భు పాత్ర‌లు. ఈ పాత్ర‌లు ప్ర‌వ‌ర్తించే తీరు స్ర్కీన్‌ప్లే కార‌ణంగా మ‌న‌కు క‌న్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సినిమా మొత్తం మ‌నం కొద్దిసేపు ప్ర‌భును, కొద్దిసేపు క్రిష్‌ను అనుమానిస్తూ పోతాం, ఇన్‌స్పెక్ట‌ర్ మాదిరిగానే. దాంతో పాటు వెంక‌ట‌ల‌క్ష్మి ప్ర‌వ‌ర్త‌న కూడా మ‌న‌కు అర్థం కాదు. ప్ర‌భును ప్రేమిస్తున్నాన‌ని చెబ్తూనే, బావ క్రిష్‌తో స‌న్నిహితంగా మెల‌గడం ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ తీసింది. దానివ‌ల్ల వెంక‌ట‌ల‌క్ష్మి పాత్ర‌ను మ‌నం ప్రేమించ‌లేం. ఆమెను ఏ కార‌ణంతో ప్ర‌భు ప్రేమించాడో తెలిశాక‌, అత‌డినీ మ‌నం అభిమానించ‌లేం. వెంక‌ట‌ల‌క్ష్మి, ప్ర‌భు ప్రేమించుకుంటున్నార‌ని తెలిసీ, ఆమెను పెళ్లి చేసుకోవాల‌నుకున్న క్రిష్‌నైనా అంతే. 

ఇంట‌ర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగుంది. అక్క‌డ్నుంచి క‌థ అనేక మ‌లుపుల‌తో సాగి, చివ‌ర‌కు మ‌నం ఊహించిన విధంగానే గ‌ట్టి క‌థ‌లా కాకుండా ఓ పిట్ట క‌థ అనిపిస్తుంది. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సునీల్ కుమార్ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకు రిచ్‌నెస్ తీసుకొచ్చింది. విజువ‌ల్‌గా సినిమాకు వంక పెట్ట‌లేం. స్క్రీన్‌ప్లేకు త‌గ్గ‌ట్లే ఎడిటింగ్ ఉంది. అంటే రెండూ కాంప్లికేటెడ్‌. వివేక్ అన్నామ‌లై ఆర్ట్ వ‌ర్క్ కూడా బాగుంది.

ప్ల‌స్ పాయింట్స్‌:
సంజ‌య్ రావు, విశ్వంత్ న‌ట‌న‌
మ్యూజిక్‌, సినిమాటోగ్ర‌ఫీ
ఇంట‌ర్వెల్ పాయింట్, సెకండాఫ్‌

మైన‌స్ పాయింట్స్‌:
ఫ‌స్టాఫ్‌లో విసుగెత్తించే స‌న్నివేశాలు
క‌న్‌ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే
హీరోయిన్‌
పాత్ర‌ల చిత్ర‌ణ ఆక‌ట్టుకునేలా లేక‌పోవ‌డం

న‌టీన‌టుల అభిన‌యం:
ఇది బ్ర‌హ్మాజీ త‌న‌యుడు సంజ‌య్ రావు ప‌రిచ‌య చిత్రం. ప్ర‌భు పాత్ర‌లో బాగానే రాణించాడు. చాలా మంది కొత్త న‌టుల కంటే తొలి చిత్రంలో మెరుగైన న‌ట‌నే ప్ర‌ద‌ర్శించాడు. పాత్ర‌లోని వేరియేష‌న్స్‌ను బాగా చూపాడు. తొలి చిత్రంలోనే ఈ త‌ర‌హా పాత్ర ప‌డ‌టం వ‌ల్ల న‌టుడిగా అత‌డికి ఎలివేష‌న్ ల‌భించింది. దాన్న‌త‌డు బాగా ఉప‌యోగించుకున్నాడు. 'కేరింత'‌, 'మ‌న‌మంతా' సినిమాలతో ఆక‌ట్టుకున్న విశ్వంత్ దుద్దుంపూడి ఈ మూవీలో క్రిష్ అనే భిన్న‌మైన పాత్ర‌లో మెప్పించాడు. అత‌డి పాత్ర‌లోనూ భిన్న ఛాయ‌లున్నాయి. వాటిని బాగా ప్ర‌ద‌ర్శించాడు. వెంక‌ట‌ల‌క్ష్మిగా నిత్యా శెట్టి ఆక‌ట్టుకోలేక‌పోయింద‌ని చెప్పాలి. క‌థ న‌డిచేది ఆమె పాత్ర చూట్టూనే. ప్రేక్ష‌కుల అటెన్ష‌న్ ఎక్కువ‌గా ఉండేది కూడా ఆమెపైనే. ఆ పాత్ర‌లో క్యూట్‌గా క‌నిపించే తార అయితే బాగుండేది. నిత్య‌లో ఆ క్యూట్‌నెస్ క‌నిపించ‌లేదు. అస‌లామె హీరోయిన్‌లాగే లేదు. ఇన్‌స్పెక్ట‌ర్‌గా బ్ర‌హ్మాజీ పాత్ర ప‌రిధి మేర‌కు చేశాడు. చిన్న చిన్న పాత్ర‌ల్లో క‌నిపించే శ్రీ‌నివాస్ భోగిరెడ్డికి ఈ సినిమాలో వెంక‌ట‌ల‌క్ష్మి తండ్రి వీర్రాజుగా పెద్ద పాత్ర ల‌భించింది. దానికి న్యాయం చేశాడు. ప్ర‌భు ఫ్రెండ్ పండుగా న‌టించిన బాల‌రాజు ఆక‌ట్టుకున్నాడు. ఉన్నంత‌లో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. 

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌:
చివ‌ర‌ టైటిల్ కార్డ్‌లో క‌న్‌ఫ్యూజ్ స్టోరీ, క‌న్‌ఫ్యూజ్ స్క్రీన్‌ప్లే, క‌న్‌ఫ్యూజ్ డైలాగ్స్‌, క‌న్‌ఫ్యూజ్ డైరెక్ష‌న్ అని డైరెక్ట‌రే స్వ‌యంగా స్క్రీన్‌పై వేసుకున్నాడు. ఈ సినిమా కూడా దానికి త‌గ్గ‌ట్టే ఒక తిక‌మ‌క పిట్ట క‌థ‌లా ఉంది. ఓపిక ఉన్న‌వాళ్లు వెళ్లి తిక‌మ‌క ప‌డ‌వ‌చ్చు.

రేటింగ్‌: 2.25/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.