కారు నంబర్.. MDO 1522
on May 6, 2021
అది 1953వ సంవత్సరం.. ఒక ఆకుపచ్చ మోరిస్ మైనర్ కారు వచ్చి, మద్రాస్ కోడంబాకం హైరోడ్లోని ఓ ఇంటి ముందు గేటుకి కొంచెం దూరంగా ఆగింది. అందులోంచి ఓ అందమైన యువకుడు దిగాడు. ఆయన చేతిలో ఓ ఫైలు ఉంది. మరో చేత్తో ఆయన పంచె కుచ్చెళ్లు పట్టుకొని ఠీవిగా లోపలకు వచ్చాడు. ఆయనలో తెలుగుదనం, తెలుగు అందం ఉట్టిపడుతోంది.
ఆయన ఆ ఇంటిలోపల ఉన్న నిర్మాతను కలిసి, "మీరు పంపిన డైలాగ్స్ అన్నీ చదువుకు వచ్చాను. నా పద్ధతిలో మీకు వినిపిస్తాను. ఏమన్నా మార్పులూ చేర్పులూ చెబితే చేసుకుంటాను." అన్నాడు.
ఆ చిత్రం.. 'వద్దంటే డబ్బు'. ఆ నటుడు నందమూరి తారకరామారావు. ఆ నిర్మాత హెచ్.ఎం. రెడ్డి.
ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు. ఆ 113 నంబరు ఇల్లూ లేదు. ఆ నిర్మాణ సంస్థ రోహిణీ పిక్చర్స్ కూడా లేదు. ఆ కారు నంబర్ MDO 1522. ఆ కారు మాత్రం చాలా కాలం హైదరాబాద్ రామకృష్ణా సూడియోస్లో ఉంది. చాలా సినిమాల తొలిరోజు షూటింగ్కు ఎన్టీఆర్ ఆ కారులోనే వచ్చేవారు.
Also Read