వెండితెరపై అద్వితీయంగా ఆకట్టుకున్న 'అల్లూరి సీతారామరాజు'
on May 7, 2021
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 7) ఒక మహోజ్వల శక్తి. ఆయన బ్రిటీష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు. అలాంటి సాహసికునిపై 90 ఏళ్ల వయసున్న తెలుగు సినిమాలో ఇంతదాకా ఒకే ఒక్క చిత్రం వచ్చింది. అది కృష్ణ నటించిన 100వ చిత్రం 'అల్లూరి సీతారామరాజు' (1974). బాక్సాఫీసు వద్ద అద్భుత విజయాన్నీ, ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్నీ పొందిన మహోజ్వల చిత్రంగా అది కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకుంది.
నిజానికి అల్లూరి సీతారామరాజుపై సినిమా తీయాలని మొదట సంకల్పించింది విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు. సంకల్పించడమే కాదు, దానికి సంబంధించిన పనులనూ ఆయన మొదలుపెట్టారు. స్క్రిప్టు రాయించుకున్నారు కూడా. కానీ అప్పుడే పెద్ద కుమారుడు రామకృష్ణ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ ప్రాజెక్టును ఆయన ఆపేశారు. ఆ తర్వాత శోభన్‌బాబు హీరో ఓ సీనియర్ నిర్మాత సీతారామరాజుపై సినిమా తీయాలనుకున్నారు. అదీ అటకెక్కింది. ఒక సాహసవీరుడి కథను వెండితెరపై ఆవిష్కరించడానికి సినీ రంగంలో సాహసికుడిగా పేరుగాంచిన కృష్ణ రెడీ అయ్యారు. అప్పట్లో అది ఇండస్ట్రీలో సంచలన వార్తగా మారింది.
స్క్రిప్టు బాధ్యతలను తనకెంతో ఇష్టుడైన రచయిత త్రిపురనేని మహారథికి అప్పగించారు కృష్ణ. ఈ స్క్రిప్టు రూపకల్పనను ఓ తపస్సులా భావించిన మహారథి, అనేక ఇతర సినిమాలను వదులుకొని, ఒక్కడే ఒకచోటకు వెళ్లిపోయి, 'అల్లూరి సీతారామరాజు' స్క్రిప్టును, సంభాషణలను రాశారు. ఆ స్క్రిప్టు చదివిన కృష్ణకు ఒక గొప్ప సినిమా తీస్తున్నామనే నమ్మకం ఆ క్షణానే కలిగింది. మద్రాసులోని వాహినీ స్టూడియోలో ఇండోర్ సీన్లు చిత్రీకరించి, చింతపల్లి అడవుల దగ్గర ఔట్‌డోర్ సీన్లు తీశారు. అప్పటిదాకా చేసిన సినిమాలు ఒకెత్తు, ఈ ఒక్కటీ ఒకెత్తు అనే రీతిలో రామరాజు పాత్రను అద్వితీయంగా పోషించారు కృష్ణ. ఆయన మరదలు సీత పాత్రను విజయనిర్మల చేశారు.
అదివరకు 'అసాధ్యుడు' చిత్రంలోనే సీతారామరాజు గెటప్ వేశారు కృష్ణ. ఆ చిత్రానికి దర్శకుడైన వి. రామచంద్రరావునే ఈ సినిమాకీ దర్శకుడిగా ఎంచుకున్నారు కృష్ణ. అయితే కొంత షూటింగ్ తర్వాత రామచంద్రరావు అనారోగ్యం పాలవడంతో కృష్ణ స్వయంగా మిగతా సన్నివేశాలను డైరెక్ట్ చేశారు. యాక్షన్ సీన్లను కె.ఎస్.ఆర్. దాస్ తీశారు. అలా సినిమా పూర్తయింది. 1974 మే 1న విడుదలైన 'అల్లూరి సీతారామరాజు' తొలి ఆటకే అద్భుతంగా ఉందనే టాక్ తెచ్చుకుంది. ఆదినారాయణరావు బాణీలు సమకూర్చిన తెలుగువీర లేవరా, వస్తాడు నా రాజు, రగిలింది విప్లవాగ్ని ఈరోజే, వీరుడు మరణించడు పాటలు అజరామరంగా నేటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. మహారథి రాసిన డైలాగ్స్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించాయి. క్లైమాక్స్‌లో కృష్ణ చెప్పిన డైలాగ్స్, ఆయన నటన రోమాలు నిక్కబొడుచుకొనేలా చేశాయి. శ్రీశ్రీ రాసిన 'తెలుగువీర లేవరా' పాటకు జాతీయ అవార్డు వచ్చింది. 19 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన 'అల్లూరి సీతారామరాజు' తెలుగు సినిమా ఆణిముత్యాల్లో ఒకటిగా సగర్వంగా నిలిచింది.
ఇప్పుడు సీతారామరాజు పాత్ర మరోసారి తెరకెక్కుతోంది. అయితే ఇది మనకు తెలీని కాల్పనిక కథతో తీస్తున్న చిత్రం. ఆ సినిమా.. రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్'. మనకు తెలిసిన చరిత్రలో బ్రిటీష్ వాళ్లతో పోరాటానికి ముందు ఇంటి నుంచి వెళ్లిపోయి దాదాపు మూడేళ్లు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వస్తాడు రామరాజు. ఆ మూడేళ్ల కాలంలో ఆయన ఏం చేసి ఉంటాడనే ఊహాజనిత కథతో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'ను రూపొందిస్తున్నాడు. ఆ పాత్రను రామ్‌చరణ్ పోషిస్తుంటే, రామరాజు మరదలు సీత పాత్రను అలియా భట్ చేస్తోంది. ఈ సినిమా మన ముందుకు వస్తే కానీ, అల్లూరి సీతారామరాజును రాజమౌళి ఎలా చూపించాడనే విషయం మనకు తెలీదు.
(నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి)