యాక్టర్ కాకముందు డాన్స్ నాకు అన్నం పెట్టింది!
on May 6, 2021
చమ్మక్ చంద్ర అనగానే మనకు జబర్దస్త్‌లో అతను చేసిన కామెడీ స్కిట్స్ గుర్తుకొస్తాయి. సినిమాల్లోనూ అడపాదడపా వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రేక్షకుల్ని నవ్విస్తూ వస్తున్నాడు చంద్ర. జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వచ్చాక, ఆయనతో పాటు బయటకు వచ్చి కొంతకాలం 'అదిరింది' షో చేశాడు చంద్ర. ప్రస్తుతం సినిమాలు, కామెడీ షోలు చేసుకుంటూ వస్తున్న చంద్రకు యాక్టర్ కాకముందు డాన్స్ అన్నం పెట్టిందనే విషయం చాలామందికి తెలీదు.
ఇండస్ట్రీలోకి నటుడిగా రావాలనే ఆశయంతో మొదట ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ అండ్ డాన్స్ కోర్సు రెండేళ్ల పాటు చేశాడు చమ్మక్ చంద్ర. అతనితో పాటు ధన్‌రాజ్ కూడా చేశాడు. "మొదట్నుంచీ నాకు డాన్స్ అంటే ఇష్టం. ఊళ్లో ఏ పెళ్లి ఉన్నా, ఆ వేడుకలో నా డాన్స్ తప్పకుండా ఉండాల్సిందే. బాగా చేసేవాడ్నని పేరొచ్చింది. ఇన్స్టిట్యూట్కు వచ్చాక డాన్స్‌లోనూ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక, ఒక రూమ్ తీసుకొని సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడ్ని. ఈలోపు స్కూల్ వార్షికోత్సవాలలో పిల్లలకు డాన్స్ నేర్పిస్తూ, అలా వచ్చిన డబ్బుతో పొట్టగడుపుకొనేవాడ్ని. మావాళ్లు పేదవాళ్లు. వాళ్లమీద మరింత భారం పడకూడదని నా కాళ్లమీద నేను నిలబడాలనే ఉద్దేశంతో డాన్స్ నేర్పిస్తూ, ట్యూషన్లు చెప్పుకుంటూ గడిపేవాడ్ని. అలా యాక్టర్ కాకముందు డాన్స్ నాకు అన్నం పెట్టింది." అని చెప్పుకొచ్చాడు చంద్ర.
చంద్ర చేసిన స్కిట్లు చూస్తే, వాటిలో అతడు చేసిన డాన్స్ ఆకట్టుకుంటుంది. అతడిలో కమెడియన్ మాత్రమే కాకుండా మంచి డాన్సర్ కూడా ఉన్నాడనే విషయం అర్థమవుతుంది.