వీరయ్య వర్సెస్ వీర సింహా.. మధ్యలో నలిగిపోతున్న మైత్రి!
on Nov 9, 2022

సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా ఉంటుంది. ఈ ఇద్దరూ ఎన్నోసార్లు బాక్సాఫీస్ వార్ కి దిగారు. కొన్నిసార్లు మెగాస్టార్ పైచేయి సాధిస్తే, మరికొన్ని సార్లు బాలయ్య పైచేయి సాధించారు. ఎన్నో ఏళ్లపాటు టాప్-2 హీరోలుగా వెలుగొందిన స్టార్స్ కావడంతో వీరి బాక్సాఫీస్ పోరు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. సంక్రాంతికి ఈ ఇద్దరూ మరోసారి బరిలోకి దిగుతున్నారు. 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీర సింహా రెడ్డి'తో బాలకృష్ణ సమరానికి సై అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తారో తెలియదు గానీ ఈ ఇద్దరి మధ్యలో మైత్రి మూవీ మేకర్స్ నలిగిపోతుంది. ఎందుకంటే ఆ రెండు సినిమాలను నిర్మిస్తున్నది మైత్రినే కావడం గమనార్హం.
ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒకే బ్యానర్ లో రూపొందిన రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడం చాలా అరుదు. ఎందుకంటే అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. పైగా ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అంటే అది నిర్మాణ సంస్థకు కత్తి మీద సామే. భారీగా ప్రమోషన్స్ చేయాలి, భారీ సంఖ్యలో థియేటర్స్ లో విడుదల చేయాలి. ఏదైనా ఒక హీరో సినిమాని ఎక్కువ థియేటర్స్ లో విడుదల చేస్తే మరో హీరో ఫ్యాన్స్ గొడవ చేసే ఛాన్స్ ఉంది. పొరపాటున ఒక్క సినిమానే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, మరో హీరో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. అందుకే '2023 సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య' అని ఎప్పటినుంచో వార్తలొచ్చినా చాలామంది కొట్టిపారేశారు. ఒకే బ్యానర్ లో రూపొందే సినిమాలు ఒకేసారి ఎలా విడుదలవుతాయనే ప్రశ్నలు తలెత్తాయి. మైత్రి సైతం ఈ పోరుని తప్పించడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు ఇద్దరు వీరుల మధ్య నలిగిపోతోంది.

'వీర సింహా రెడ్డి'ని కాస్త ముందే విడుదల చేయాలని మైత్రి అనుకుంటే బాలయ్య మాత్రం సంక్రాంతికే రావాలని పట్టుబడుతున్నారట. ఎందుకంటే మైత్రి చెప్పిన విడుదల తేదీ అమావాస్యట. దానికితోడు బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. సంక్రాంతి ఆయనకు 'సమరసింహా రెడ్డి', 'నరసింహానాయుడు' వంటి ఇండస్ట్రీ హిట్స్ ని ఇచ్చింది. అలాంటిది సంక్రాంతికి విడుదల చేసే అవకాశమొస్తే బాలయ్య ఎందుకు వదులుకుంటారు. ఇక 'వాల్తేరు వీరయ్య' విషయానికొస్తే సంక్రాంతికి విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. అందుకే ఇప్పుడు బాలయ్య కోసం చిరంజీవిని ముందుకో వెనక్కో జరగమని చెప్పే సాహసం చేయలేకపోతోంది మైత్రి. బాలయ్యకి నచ్చజెప్పలేక, చిరంజీవిని నొప్పించలేక ఇద్దరి మధ్యలో మైత్రి నలిగిపోతోందట.

ఇక ఈ రెండు సినిమాలు సంక్రాంతికే రావడం ఖరారైంది కానీ ముందుగా ఏ సినిమాని విడుదల చేయాలనే విషయంలోనూ మైత్రి సతమతమవుతోందట. ఒక సినిమాని జనవరి 11న, మరో సినిమాని జనవరి 12 లేదా 13 విడుదల చేయాలని చూస్తోంది. కానీ చిరు, బాలయ్య ఎవరికివాళ్ళు తమ సినిమానే ముందు విడుదల కావాలని పట్టుబట్టే అవకాశముంది. ఎందుకంటే జనవరి 11న విడులయ్యే సినిమా సోలో రిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లన్నీ ఆక్రమించి భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఆస్కారముంటుంది. జనవరి 12 లేదా 13న విడుదలయ్యే సినిమాకి ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పటికే ఒక సినిమా చాలా థియేటర్లు ఆక్రమించి ఉంటుంది. దానికితోడు జనవరి 12న దిల్ రాజు నిర్మిస్తున్న 'వారసుడు' విడుదలవుతోంది. దిల్ రాజు సినిమా అంటే నైజాంలో మెజారిటీ థియేటర్లతో పాటు, ఆంధ్రాలోనూ భారీ సంఖ్యలో థియేటర్లను ఆక్రమిస్తుందనడంలో సందేహం లేదు. అంటే చిరు, బాలయ్య సినిమాలలో ముందుగా విడుదలయ్యే సినిమా ఓపెనింగ్స్ పరంగా ఎంత లాభపడుతుందో, తర్వాత విడుదలయ్యే సినిమా అంతలా నష్టపోతుంది. అందుకే చిరు, బాలయ్య ఇద్దరూ జనవరి 11నే తమ సినిమా విడుదలవ్వాలని పట్టుబట్టే ఛాన్స్ ఉంది. దీంతో మైత్రి వారికి ఏం చేయాలో అర్థం కావట్లేదట. ఈ సంక్రాంతి గండం ఎలాగోలాగ గట్టెక్కితే చాలని అనుకుంటున్నారట. అంతేకాదు ఇంకోసారి ఎప్పుడూ ఇలా ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోల సినిమాల తెరకెక్కించి ఇలాంటి తలనొప్పులు తెచ్చుకోకూడదని జ్ఞానోదయం కలిగిందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



