సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేస్తున్న బొద్దు భామ!
on May 6, 2021
తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బొద్దు భామ నమిత త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేయబోతోంది. దాని పేరు 'నమిత థియేటర్'. యథార్థ ఘటనలతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్, మూవీస్‌ను ఈ యాప్‌లో స్ట్రీమింగ్ చేస్తారు. ఇప్పటివరకూ ఈ తరహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాలేదని నమిత అంటున్నారు.
ఓటీటీలో భాగం కావాలని ఎందుకు అనుకుంటున్నారనే ప్రశ్నకు, "నేనెప్పుడూ కొత్తవాళ్లకు - వాళ్లు యాక్టర్లయినా, డైరెక్టర్లయినా - ఇండస్ట్రీలో తమదైన ముద్రవేయడానికి సాయం చేయాలకుంటాను. నేనిప్పుడు లాంచ్ చేయబోయే ప్లాట్‌ఫామ్ ద్వారా చిన్న బడ్జెట్ నిర్మాతలకు తమ సినిమాలను రిలీజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం. 'నమిత థియేటర్'లో స్ట్రీమ్ చేయబోయే ఫస్ట్ బ్యాచ్ కంటెంట్‌ను అనౌన్స్ చేయడానికి పర్ఫెక్ట్ డేట్ కోసం చూస్తున్నాం." అని చెప్పారు.
నమిత థియేటర్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా రవి వర్మ వ్యవహరిస్తున్నారు. "పేరున్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి అనుభవం సంపాదించిన ప్రతిభావంతులైన కొత్తవాళ్లను ప్రమోట్ చేయడంపై మేం ఫోకస్ పెడుతున్నాం." అని ఆయన తెలిపారు.
తెలుగులో 'సొంతం' సినిమాతో నాయికగా పరిచయమైన నమిత, ఆ తర్వాత జెమిని, ఒక రాజు ఒక రాణి, నాయకుడు, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె 'బౌ బౌ' అనే తమిళ మూవీలో నటిస్తున్నారు.