చిరంజీవి సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
on May 6, 2021
టాలీవుడ్లో ఎన్టీఆర్ తర్వాత అత్యధిక కాలం నంబర్ వన్ స్టార్‌గా వెలుగొందారు మెగాస్టార్ చిరంజీవి. పాలిటిక్స్‌లోకి ఎంటర్ కాకముందు వరకు ఆయనకు తిరుగనేది లేకుండా ఉండేది. టాలీవుడ్ ఐకానిక్ స్టార్‌గా తనదైన ముద్రవేసి, సౌతిండియాలో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో ఒకరిగా ఆయన పేరుపొందారు. రాజకీయాలకు విరామమిచ్చి, తొమ్మిదేళ్ల గ్యాప్‌తో ఆయన తిరిగి హీరోగా 'ఖైదీ నంబర్ 150'తో వచ్చినప్పుడు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 'సైరా.. నరసింహారెడ్డి' సినిమాతో మెప్పించి, అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.
రి-ఎంట్రీలో ఆయన చేస్తున్న సినిమాలను కుమారుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అయినప్పటికీ సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ రూ. 30 కోట్లుగా లెక్కిస్తున్నట్లు సమాచారం. ఒక అంచనా ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ రూ. 650 కోట్లు. చిరంజీవి వద్ద మంచి కార్ కలెక్షన్ కూడా ఉంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ లాంటి అత్యంత విలాసవంతమైన కారు ఆయన సొంతం. అలాగే రోల్స్ రాయిస్ వోగ్, ల్యాండ్ క్రూజర్, ఆస్టన్ మార్టిన్ వి8 వాంటేజ్, బెంజ్ ఎస్ క్లాస్, బెంట్లీ లాంటి కార్లను ఆయన సందర్భానుసారం వాడుతుంటారు.
ఇటీవలే ఆయన తన అభిరుచులకు అనుగుణంగా కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. అందులోని ఇంటీరియర్ డిజైన్ కళ్లు చెదిరేలా ఉంటుంది. తల్లి అంజనాదేవి, భార్య సురేఖలతో ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు చిరంజీవి. అప్పుడప్పుడు తాను స్వయంగా వంటలు చేసి అమ్మకు తినిపిస్తున్న ఫొటోలు, వీడియోలను ఆయన షేర్ చేస్తుంటారు. సందర్భాలు వచ్చినప్పుడల్లా కుమారుడు రామ్‌చరణ్ ఫ్యామిలీ, కుమార్తెలు సుష్మిత, శ్రీజ ఫ్యామిలీస్ కూడా అక్కడకు వచ్చి గడుపుతుంటాయి.
ప్రస్తుతం ఆయన టైటిల్ రోల్ పోషిస్తోన్న 'ఆచార్య' మూవీ ముగింపు దశలో ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో రామ్‌చరణ్ సైతం ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు.