నాగచైతన్య నమ్మశక్యం కానంత సహనశీలి.. తెగ పొగిడిన ప్రాచీ!
on Jul 5, 2022
పదిహేడేళ్ల వయసులోనే టీవీ నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ప్రాచీ దేశాయ్‌కు మంచి పాపులారిటీయే ఉంది. 2008లో 'రాక్ ఆన్' మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రాచీ, ఇటీవల రాధికా ఆప్టే, విక్రాంత్ మాసేతో కలిసి 'ఫోరెన్సిక్' మూవీలో కనిపించింది. నాగచైతన్య మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న 'దూత' వెబ్ సిరీస్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు త్వరలో పరిచయం కానున్నది. ఇటీవల సమంతతో విడిపోయినప్పట్నుంచీ నాగచైతన్య తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.
లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అతనితో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందని చెప్పిన ప్రాచీ దేశాయ్, "నా జీవితంలో నేను కలిసిన అత్యంత వినయశీలురైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన మంచి వ్యక్తి మాత్రమే కాదు, నమ్మశక్యం కానంత సహనశీలి కూడా" అని ప్రశంసించింది. "ఆయన చాలా చాలా మర్యాదస్తుడు. అదే ఒక వ్యక్తి గురించి చాలా చెబుతుంది. తెలుగులో నా తొలి సహనటుడు ఆయన కావడం పెద్ద వరం" అని చెప్పింది ప్రాచీ.
"మీకు ఒక భాష బాగా తెలిసినప్పుడు, అవతలి వ్యక్తికి ఆ భాష ఏమీ అర్థం కానప్పుడు, అది ఆయన బాధ్యత కాకపోయినా, ఒక టీమ్ ప్లేయర్‌గా నాకు చాలా సపోర్ట్‌నిచ్చాడు. ఒకసారి మేం ఒక పెద్ద సీన్ చేస్తున్నాం. దానర్థం ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే నేను హోమ్‌వర్క్ చేశాను. పుంఖాను పుంఖాలుగా, పేజీల కొద్దీ డైలాగ్స్ ఉన్నప్పుడు ఏ లైన్‌కు అర్థం ఏమిటనేది మనకు తెలీదు. నా క్లోజప్ తీసేటప్పుడు, మొత్తం డైలాగ్‌ని ఆయన నాకు ఇంగ్లిష్‌లో చెప్పాడు. దాంతో నా బెస్ట్ ఎబిలిటీతో దానికి తగ్గట్లుగా నటించాను" అని చెప్పుకొచ్చింది ప్రాచీ దేశాయ్.
నాగచైతన్య తొలిసారి డిజిటల్ వరల్డ్‌కు పరిచయమవుతున్న 'దూత' సిరీస్‌ను విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియాలో స్ట్రీమింగ్ కానున్నది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
