సీనియర్ సినీ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి
on Jul 5, 2022
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (88) కన్నుమూశారు. సోమవారం రాత్రి 2 గంటలకు (తెల్లవారితే మంగళవారం) హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటూ ఇంటివద్దే ఉంటున్న ఆయన గతవారం ఇంట్లోనే కిందపడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. నిమ్స్‌లో విజయవంతంగా సర్జరీ అయినప్పటికీ, తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2021 నవంబర్‌లో తన శ్రీమతి లక్ష్మి మృతి చెందాక, ఆయన బాగా కుంగిపోయినట్లు సన్నిహితులు తెలిపారు. ఆయనకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీరామ్ స్వదేశానికి వచ్చాక అంత్యక్రియలు జరగనున్నాయి.
సినీ విమర్శకులుగా, విశ్లేషకులుగా, విలక్షణ రచయితగా సుమారు ఐదు దశాబ్దాల కాలం ఆయన పాత్రికేయ రంగానికి తన సేవలు అందించారు. ఈనాడు దినపత్రికలో 25 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఆయన నిర్వహించిన 'హరివిల్లు' అనే శీర్షిక ఎంతో ప్రజాదరణ పొందింది. సాంస్కృతిక రంగానికి చెందిన ఎంతోమంది కళాకారులను ఆయన తన వ్యాసాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీహరి ద హిందూ, ఈనాడు వార్తా పత్రికల్లో కంట్రిబ్యూటర్‌గా 1968లో జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించారు. 20 సంవత్సరాల పాటు హైదరాబాద్‌లోని ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ బ్రాడ్‌క్యాస్టర్‌గా పనిచేశారు.
125 సంవత్సరాల చరిత్ర కలిగిన నాటక కుటుంబం సురభి గురించి ద హిందూలో ఆయన రాసిన వ్యాసం కేంద్ర సంగీత నాటక అకాడమీ దృష్టికి వెళ్లి, ఆ బృందానికి ఆర్థిక సాయం కొనసాగించేందుకు దోహదం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమపై ఆయన రాసిన పుస్తకం అందరి ప్రశంసల్నీ అందుకుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన స్క్రిప్ట్ కమిటీలో సభ్యునిగా కూడా ఆయన గౌరవం అందుకున్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌కు అధ్యక్షునిగా వ్యవహరించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
