దిల్ రాజుకు చెక్ పెడుతున్న మైత్రి మూవీ మేకర్స్!
on Jan 27, 2023
నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఇంతకాలం దిల్ రాజుకు తిరుగే లేకుండా పోయింది. ఆయన ఆధిపత్యం ఏకచత్రాధిపత్యం కొనసాగాయి. కానీ మధ్యలో ఏషియన్ ఫిలిమ్స్ వారు ఎంటర్ అయ్యారు. దీని ప్రభావం చాలా తక్కువగానే దిల్ రాజుపై పడింది. కానీ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్ సంస్థ నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదటి అడుగులోనే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లను పంపిణీ చేసింది.
సొంతంగా నిర్మించిన ఈ రెండు చిత్రాలను పంపిణీ చేయడం ద్వారా మైత్రి వారికి భారీ ఆదాయాలు వచ్చాయని సమాచారం. ఇక మైత్రి మూవీ మేకర్ సంస్థ తన బిజినెస్ పార్ట్నర్ శశితో కలిసి కొత్త అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా వారు నైజాంలోని థియేటర్లపై కన్నేశారు.
ఇంతకాలం దిల్ రాజు చేతిలో ఉన్న థియేటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవైపు దిల్ రాజు, మరోవైపు ఏషియన్ సునీల్ లలో ఎవరు కూడా తమను పట్టించుకోకపోవడంతో పలువురు ఎగ్జిబిటర్లు మైత్రికి పచ్చ జెండా ఊపుతున్నారు.
దీనికి మరో ముఖ్య కారణం ఏమిటంటే నైజాంలోని చాలా జిల్లాల్లోని థియేటర్లు రిపేర్ దశలో ఉన్నాయి. వాటిని బాగు చేయించాలంటే అంత పెద్ద మొత్తాలు ఎగ్జిబిటర్ల వద్ద లేవు. దానిని అవకాశం గా తీసుకున్న మైత్రి మూవీస్ ఆ థియేటర్లలో రిపేర్ చేసి మరల రీమోడల్ చేయడానికి తన వంతు ఆర్థిక సాయం చేయాలని భావిస్తోంది. తద్వారా నైజాంలోని థియేటర్లపై తన ఆధిపత్యం సాగేలా చూసి దిల్ రాజుకు గండి కొట్టాలని భావిస్తోంది. కానీ ఇవన్నీ దిల్ రాజుకు, ఆయన సోదరుడు శిరీశ్‌కు మింగుడు పడటం లేదు. దాంతో వారు లోకల్, నాన్‌లోకల్ అనే సెంటిమెంటును తెరపైకి తెస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో నైజాంలో మైత్రివారు తమ హవా చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
