'సక్సెస్ మీట్' అంటే సినిమా ఫ్లాపయ్యిందని అర్థం: కీరవాణి ఉవాచ
on Dec 29, 2019
టాలీవుడ్లో 'సక్సెస్ మీట్' అంటే సినిమా ఫ్లాపయ్యిందని అర్థమని ఉద్ఘాటించారు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి. ఆయన తనయుల్లో చిన్నవాడు శ్రీసింహా హీరోగా, పెద్దవాడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన 'మత్తు వదలరా' ప్రెస్ మీట్ ఆదివారం (డిసెంబర్ 30) ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరిగింది. రితేశ్ రాణా డైరెక్ట్ చేయగా చెర్రీ, హేమలత సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 25న విడుదలై మంచి మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కీరవాణి మాట్లాడారు.
"టాలీవుడ్ డిక్షనరీ వేరే ఉంది. 'బాబుగారు' అంటే హీరో. 'సక్సెస్ మీట్' అంటే సినిమా ఫ్లాపయ్యిందని అర్థం. (నిర్మాత చెర్రీని ఉద్దేశించి) మన సినిమా బాగానే ఉందిగా! నా మనసులో ఉన్న ఫీలింగ్ చెబ్దామనుకుంటున్నా. 2000 సంవత్సరం కెరీర్ పరంగా నాకు చాలా బ్యాడ్ టైం. అంటే డబ్బుల పరంగా కూడా బ్యాడ్ టైం. నేను బాధ్యత వహించాల్సిన కుటుంబ వ్యక్తులు ఇరవై ముప్పై మంది పైగా ఉన్నారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎవరి కాళ్లమీద వాళ్లు నిలబడి సెటిల్ అవుతున్నారనుకోండి. మేం ఖైరతాబాద్ దగ్గర వెంకటరమణ కాలనీలో ఉండేవాళ్లం. అప్పుడు సింగపూర్ తీసుకెళ్లాలనే టాపిక్ వచ్చింది. 'సింగపూర్ వెళ్లేంత డబ్బులు మన దగ్గర లేవు' అని నేను అటుంటే, నా భార్యతో 'నేను తీసుకెళ్తా సింగపూర్‌కి' అన్నాడు సింహా. అప్పుడు వాడిది తెలిసీ తెలియని వయసు. నాలుగేళ్లు ఉంటాయి. 'సరేరా.. నువ్వే తీసుకెళ్లు' అన్నాను. మా ఇంట్లో ఒక్కొక్కళ్లకి బాధ్యతలు తెలియాలని 'కరెంట్ బిల్లు నువ్వు కట్టరా' అంటే భైరవ ఆ బిల్లు కడుతున్నాడు. తమన్ దగ్గరా, వాళ్ల దగ్గరా పాడుతుంటాడు కదా! ఇప్పుడు నా దగ్గర సింగపూర్‌కు వెళ్లేంత డబ్బులు ఉన్నా కానీ, సింహా ప్రామిస్ చేశాడు కదా, బాలవాక్కు బ్రహ్మవాక్కు కాబట్టి, ఎప్పుడు టాపిక్ వచ్చినా నేను, నా భార్య వల్లి కూడా వాడితో 'సింగపూర్‌కు నువ్వే తీసుకెళ్లురా' అంటుంటాం. 'రంగస్థలం'లో సుకుమార్ దగ్గర పనిచేశాడు. దానికి వచ్చిన డబ్బు వాడి బట్టలకే సరిపోతుంది, ఎప్పుడు తీసుకెళ్తాడు.. అని అనుకుంటూ ఉంటుండగా, ఇప్పుడు సింగపూర్‌కు తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది అనుకుంటున్నా. నిర్మాత చెర్రీ వాడికి సింగపూర్‌కు వెళ్లడానికి సరిపడా డబ్బులు ఇస్తే వెళ్తాం. సినిమా హిట్టయితే ప్రొడ్యూసర్ సంతోషిస్తాడు. డైరెక్టర్ రితేష్ రాసుకున్న కథ మంచి హిట్టయింది. అతనికి మంచి మంచి అవకాశాలొస్తాయి. నాకివి చిన్న చిన్న ఆనందాలు" అని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read