'భీమ్లా నాయక్' విడుదలయ్యే దాకా పేదలైన ఏపీ ప్రజలు ఇప్పుడు ధనవంతులు!
on Mar 8, 2022

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరలను సవరిస్తూ అక్కడి ప్రభుత్వం సోమవారం సరికొత్త జీవోను తెచ్చింది. నిన్నటి దాకా అమలులో ఉన్న తక్కువ టికెట్ ధరలను కొత్త జీవోలో పెంచారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు తగ్గించడానికి ముందు ఉన్న రేట్లను పునరుద్ధరించారు. దీనికి తెలుగు ఫిల్మ్ చాంబర్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్‌కూ, ఏపీ ప్రభుత్వానికీ థాంక్స్ చెప్పారు. తగ్గించిన ధరలు మళ్లీ పెరగడం అనేది ఇండస్ట్రీకి కాస్త ఊపిరినిచ్చే విషయం కాబట్టి వాళ్లు ఆనందపడ్డంలో తప్పులేదు. కానీ చిరంజీవి విషయమే జనంతో పాటు మెగా ఫ్యాన్స్‌కు కూడా అంతుపట్టడం లేదంటున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా సినిమా టికెట్ రేట్లను సవరిస్తూ కొత్త జీవోను జారిచేశారంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికీ, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు చిరంజీవి. సొంత తమ్ముడి సినిమా 'భీమ్లా నాయక్' విడుదలకు ముందుగానే ఈ జీవోను ప్రభుత్వం తీసుకువచ్చే అవకాశం ఉన్నా తీసుకురాకుండా, ప్రభాస్ సినిమా 'రాధే శ్యామ్' మరో మూడు రోజుల్లో విడుదలవుతుందనంగా తీసుకురావడం వెనుక రాజకీయాలు ఉన్నాయని తెలిసి కూడా ఆయన ఇలా స్పందించడం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఏమాత్రం రుచించడం లేదు.
'భీమ్లా నాయక్' విడుదలై పది రోజులు దాటి, థియేటర్ల దగ్గర జనం పలచబడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం జీవో తెచ్చినప్పటికీ కిమ్మనకుండా ఉన్న చిరంజీవి.. ఇప్పుడు జగన్‌కు థాంక్స్ చెప్పడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక అభిమాని, "#BheemlaNayak ki anni musukunava boss? Sorry chiranjeevi sir.." అని కామెంట్ చేస్తే, ఇంకో అభిమాని, "అసలు టిక్కెట్ రేట్స్ బెనిఫిట్స్ ఎందుకు తగ్గించాడు, మళ్ళీ ఇప్పుడు కొత్త GO ఇచ్చేడేంటి.. లేని సమస్యను సృష్టించి మళ్ళీ దాన్ని పరిష్కరిస్తున్నట్లు ఈ దొంగ నాటకాలు ఏంటో #BheemlaNayak మూవీ తర్వాతనే GO ఇవ్వాలి అనుకున్నాడు, ఇచ్చాడు. ఇదంతా టార్గెట్ పవన్ కళ్యాణ్ నే. అయిన pk నీ ఏం పీకలేక పోయాడు" అని రాసుకొచ్చాడు.
మరో అభిమాని ఒక మీమ్‌తో ప్రభుత్వంపై వ్యంగ్యంగా చురకలు వేశాడు. "భీమ్లా నాయక్ మూవీ వరకే మీరు పేదవారు" అని ఏపీ ప్రభుత్వం చెప్తున్నట్లు, "మరి ఇప్పుడు?" అని ప్రజలు ప్రశ్నిస్తే, "ధనవంతులు.. ఎంత అంటే సినిమా టికెట్ కొనుక్కొని చూసేంత ధనవంతులు" అని ప్రభుత్వం అంటున్నట్లు మీమ్ క్రియేట్ చేసి వదిలాడు. సినిమా టికెట్ ధరలను పెంచి పేదవాళ్లపై భారం వేయాలా అని రాష్ట్ర మంత్రులు కొంతమంది నోరు చేసుకోవడం మనం చూశాం.. మరిప్పుడు ఆ నోళ్లు ఏం అంటాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



