'ఆచార్య' గాయం.. మళ్ళీ కొరటాలపై మెగా ఫ్యాన్స్ ఫైర్!
on Nov 29, 2022

'మిర్చి' నుంచి 'భరత్ అనే నేను' వరకు వరుసగా నాలుగు విజయాలు అందుకొని సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ 'ఆచార్య'తో ఘోర పరాజయాన్ని చూశాడు. మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ లతో చేసిన ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచి కొరటాలను కుంగదీసింది. మెగా అభిమానులు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. సినిమా విడుదలై ఆరు నెలలు దాటినా ఆయనను ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే 'ఆచార్య' పరాజయానికి కారణం దర్శకుడే అని చిరంజీవి వ్యాఖ్యలు చేయగా.. ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కూడా సినిమాలో సంగీతం అంతగా ఆకట్టుకోకపోవడానికి కారణం కొరటాలే అన్నట్టుగా వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు.
చిరంజీవి-మణిశర్మ కాంబినేషన్ లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. అయితే 'ఆచార్య'కు మాత్రం మణిశర్మ ఆశించిన స్థాయిలో సంగీతం అందించలేదన్న అభిప్రాయం మెగా అభిమానుల్లో ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం విషయంలో ఆయన నిరాశపరిచాడని వారు అభిప్రాయపడ్డారు. అయితే మణిశర్మ మాత్రం 'ఆచార్య' సంగీతం విషయంలో తనదేం తప్పులేదు అంటున్నారు.
ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో మణిశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు "ఆచార్య చిత్రంలో సంగీతం ఎందుకు ఆశించినస్థాయిలో అలరించలేకపోయింది" అనే ప్రశ్న ఎదురైంది. దీనికి "రెండు పాటలు హిట్ అయ్యాయి కదా" అంటూ నవ్వుతూ సమాధానం చెప్పిన మణిశర్మ.. ఆ వెంటనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. "గతంలో చిరంజీవి గారి సినిమాలకు పని చేసిన అనుభవంతో 'ఆచార్య'కు ఒక వెర్షన్ చేశా. అయితే డైరెక్టర్ గారు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అన్నారు. దానిలో తప్పులేదు.. ఎందుకంటే ఎప్పుడూ కొత్తగా చేస్తుండాలి" అని మణిశర్మ చెప్పుకొచ్చారు. మణిశర్మ మాటలను బట్టి చూస్తే కొరటాల అభిరుచికి తగ్గట్టుగా సంగీతం అందించారని అర్థమవుతోంది. దీంతో మెగా అభిమానులు మరోసారి కొరటాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



