'మేజర్' మూవీ రివ్యూ
on Jun 2, 2022
.webp)
సినిమా పేరు: మేజర్
తారాగణం: అడివి శేష్, సాయీ మంజ్రేకర్, ప్రకాశ్‌రాజ్, రేవతి, మురళీశర్మ, శోభిత ధూళిపాళ, అనీశ్ కురువిల్లా
కథ, స్క్రీన్‌ప్లే: అడివి శేష్
సంభాషణలు: అబ్బూరి రవి
పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణకాంత్, రాజీవ్ భరద్వాజ్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
ఎడిటింగ్: వినయ్‌కుమార్ సిరిగినీడి, కోదాటి పవన్ కల్యాణ్
ప్రొడక్షన్ డిజైనింగ్: అవినాశ్ కొల్లా
యాక్షన్: సునీల్ రోడ్రిగ్స్
దర్శకత్వం: శశికిరణ్ తిక్కా
బ్యానర్స్: సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ యస్ మూవీస్
విడుదల తేదీ: 3 జూన్ 2022
దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని తాజ్‌మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన టెర్రరిస్ట్ దాడుల్లో అనేకమంది పౌరులను కాపాడే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయిన వీర సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ 'మేజర్' అనే సినిమా చేస్తున్నాడనీ, దాన్ని మరో రెండు ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి మహేశ్‌బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోందనీ వార్త వచ్చినప్పుడు చాలామంది 'అవునా' అనుకున్నారు తప్పితే, పెద్దగా ఎగ్జయిట్ అవలేదు. శేష్‌ను ఇదివరకు 'గూఢచారి'గా చూపించి హిట్ కొట్టిన శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేసిన 'మేజర్' ఇప్పుడు మనముందుకు వచ్చేసింది.
కథ
మలయాళీ కుటుంబానికి చెందిన సందీప్ ఉన్నికృష్ణన్ తల్లితండ్రుల అభీష్టానికి విరుద్ధంగా ఆర్మీలో చేరతాడు. అతనికి అన్నింటికంటే దేశమే ముఖ్యం. ఆర్మీలో అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్‌కు ట్రైనింగ్ ఆఫీసర్ అవుతాడు. క్లాస్‌మేట్ ఇషాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇషా ఆర్కిటెక్ట్‌గా బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటే, సందీప్ హర్యానాలో ఉంటాడు. అతను తన దగ్గర ఉండట్లేదని బాధపడుతుంటుంది ఇషా. ఫోన్‌లో ఈ విషయమై అతడితో వాదులాడుతుంది కూడా. ఇక లాభం లేదని సెలవు తీసుకొని బెంగళూరు బయలుదేరుతాడు సందీప్. అదే సమయంలో కొంతమంది టెర్రరిస్టులు ముంబై వచ్చి, తాజ్‌మహల్ హోటల్ సమీపంలో బాంబ్ బ్లాస్టులు చేసి, అనేకమందిని కిరాతకంగా చంపేస్తారు. చాలామంది భయంతో తలదాచుకోడానికి తాజ్‌మహల్ హోటల్‌లోకి పరుగులు పెడతారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఉగ్రవాదులు వారిలో అనేకమందిని గన్స్‌తో కాల్చేస్తారు. హోటల్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. బెంగళూరుకు బయలుదేరిన సందీప్‌కు ఈ వార్త తెలియగానే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. తన స్పెషల్ యాక్షన్ గ్రూప్‌ను తీసుకొని తాజ్‌మహల్ హోటల్‌కు వెళ్తాడు. ఆ తర్వాత అతను టెర్రరిస్టులతో ఎలా తలపడ్డాడు, అందులో చిక్కుకున్న పౌరుల్ని కాపాడ్డానికి ఎలాంటి రిస్కులు చేశాడు, ఆ క్రమంలో ఎలా తన ప్రాణాల్ని పణంగా పెట్టాడనేది కథ.
విశ్లేషణ
'మేజర్' నిజంగా ఒక ఔట్‌స్టాండింగ్ ఫిల్మ్. ఒక వీర జవాను నిజ జీవిత కథను ఎక్కువ డ్రామా లేకుండా, ఎక్కువ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా, వాస్తవికంగా చూపిస్తూనే, రోమాలు నిక్కబొడుచుకొనే తీరులో అత్యంత ఉద్వేగభరితమైన సన్నివేశాల కల్పనతో, స్క్రీన్‌ప్లేతో సెల్యులాయిడ్‌పై చిత్రీకరించడం మనం తెలుగు తెరపై ఇంతదాకా చూసి ఉండలేదు. ఆ క్రెడిట్ కచ్చితంగా మేజర్‌కు దక్కుతుంది. నవంబర్ 26 ముంబై దాడుల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. అవేవీ 'మేజర్' ముందు నిలిచేవి కావు. తాజ్‌మహల్ హోటల్‌పై జరిగిన దాడిలో మేజర్ సందీప్ చేసిన సాహసం, అతని ప్రాణత్యాగం మాత్రమే మనకు తెలుసు. కానీ అతని కోణం నుంచీ, అతని జీవితం నుంచీ తియ్యడమే 'మేజర్'ను ప్రత్యేకంగా నిలిపింది.
ఇస్రో ఆఫీసర్ అయిన ఉన్నికృష్ణన్ కొడుకు సందీప్‌ను డాక్టర్‌గా, అమ్మ ధనలక్ష్మి ఇంజనీర్‌గా చూడాలనుకుంటే సందీప్ నేవీలో చేరాలనుకుంటాడు. అమ్మానాన్నలకు తెలీకుండా నేవీ ఉద్యోగానికి అప్లై చేస్తాడు కూడా. కానీ కళ్లజోడు కారణంగా ఆ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్లు వచ్చిన లెటర్ చూసి అమ్మానాన్నలు షాకవుతారు. అప్పుడే ఇషా దేశానికి సేవ చేయాలంటే నేవీ ఒక్కటే కాదనీ, ఇంకా ఉన్నాయిగా అనడంతో, అప్పటికప్పుడు ఆర్మీలో చేరతానని తండ్రితో ధైర్యంగా చెప్పేస్తాడు సందీప్. అక్కడ్నుంచి ఆర్మీలో చేరడానికి సందీప్ బయలుదేరుతుంటే వచ్చే సన్నివేశాలు మనసుని తాకుతాయి. సైన్యంలో పనిచేసే ప్రతి వ్యక్తి కుటుంబాన్ని మరింతగా భావోద్వేగానికి గురిచేస్తాయి. అలాగే ట్రైనింగ్ టైమ్‌లో ఇషా రాసిన ఉత్తరాలు తనకు చేరకుండా తోటి సోల్జర్ దాచిపెట్టిన విషయం తెలిసి, ఆ ఉత్తరాల కోసం సందీప్ పడే ఆరాటం, అవి చేతికందాక అతడు పడే ఉద్వేగానుభూతులు, అప్పటికప్పుడు బయలుదేరి ఇషా ఇంటికి వెళ్లి, ఆమెను కలుసుకోవడం, వర్షంలో బస్సెక్కబోతూ అతను ఆమెకు ఐ లవ్ యూ చెబితే, ఇషా గొడుగును కిందపడేసి, పరుగెత్తుకుంటూ బస్సెక్కి సందీప్‌కు ఐ లవ్ యూ టూ అనిచెప్పి ముద్దుపెట్టుకోవడం.. ఈ సీన్లను ఎంతో ఎమోషనల్‌గా తీశాడు దర్శకుడు. భార్యాభర్తలు వేర్వేరు చోట ఉంటే, ఇద్దరూ తరచూ కలుసుకోవడానికీ, కలిసుండటానికీ వీలు కుదరకపోతుంటే ఆ ఇద్దరి మధ్యా జరిగే ఘర్షణ, మానసిక ఘర్షణను కూడా శశికిరణ్ చాలా బాగా చిత్రీకరించాడు. ఆ సన్నివేశాలను అలా కల్పించిన శేష్‌కూ క్రెడిట్ ఇవ్వాలి.
ఇక సీన్ తాజ్‌మహల్‌కి మారాక, టెర్రరిస్టులు ముంబైకి సముద్రం మీద వచ్చి ఎలా హింసాకాండకు తెగబడ్డారో చూపించిన వైనం చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. హోటల్‌లో కిరాతకంగా గన్స్‌తో పౌరుల్ని, హోటల్ సిబ్బందినీ కాల్చివేసే సీన్లు కానీ, సందీప్ తన టీమ్‌తో పౌరుల్ని కాపాడ్డానికి ప్రదర్శించే ధైర్య సాహసాలు కానీ, ప్రాణాలను లెక్కచెయ్యకుండా చివరలో తనొక్కడే టెర్రిరిస్టులు ఉన్న చోటకు వెళ్లి వాళ్లతో తలపడే సీన్లు కానీ సూపర్బ్ అనిపిస్తాయి. ఈ క్రమంలో ఎన్నో సార్లు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అనేక మార్లు కళ్లు తడవుతాయి. క్లైమాక్స్‌లో కొడుకు గురించి ఉన్నికృష్ణన్ ఇచ్చే స్పీచ్ మనల్ని మరింతగా ఉద్వేగభరితుల్ని చేస్తుంది.
ఈ సినిమా ఇలా రావడంలో టెక్నీషియన్ల కృషి ఎంతైనా ఉంది. ముందుగా సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు పనితనాన్ని ఎంతైనా మెచ్చుకోవాలి. సందీప్ కథతో మనం కనెక్ట్ అవడంలో సినిమాటోగ్రఫీ పాత్ర చాలా ఉంది. అతనికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆ తర్వాత శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఏం మ్యూజిక్ ఇచ్చాడతను! టెర్రిఫిక్!! అబ్బూరి రవి సందర్భోచిత సంభాషణలు, అవినాశ్ కొల్లా ఆర్ట్ వర్క్, సెకండాఫ్‌లో సునీల్ రోడ్రిగ్స్ యాక్షన్ కొరియోగ్రఫీ.. అన్నీ అలా కుదిరాయంతే! ఈ సినిమాతో డైరెక్టర్‌గా శశికిరణ్ అనేక మెట్లు పైకెక్కేశాడు. సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కారణమే.
నటీనటుల పనితీరు
సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్‌లో అడివి శేష్ జీవించాడంతే. ఆ క్యారెక్టర్‌ను చాలా ముందు నుంచే ప్రేమించడం వల్లా, సందీప్ కథను పరిశోధించడం వల్లా తానే అతడిలా మారిపోయాడు. ఇంతదాకా మనం చూసిన శేష్ కాడు, ఈ శేష్.. ఇతనో కొత్త శేష్ అన్నట్లు కనిపించాడు. సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్ అంటారే అలా చేశాడు. కాలేజీ స్టూడెంట్‌గా లేతగా కనిపించడానికి ఏం చేశాడో కానీ, సరిగ్గా కాలేజీ స్టూడెంట్ లానే ఉన్నాడు. ఆ తర్వాత సోల్జర్ అయ్యాక.. ఓ డిగ్నిటీ వచ్చినవాడులా మారిపోయాడు. ఇషా పాత్రలో సాయీ మంజ్రేకర్ అందంగా ఉంది. కాకపోతే కొన్నిచోట్ల ఆమె హావభావాల్లో అపరిపక్వత కనిపించింది. సందీప్ తల్లితండ్రులుగా రేవతి, ప్రకాశ్‌రాజ్ పర్‌ఫెక్ట్. కొడుకు ఆనుపానులు తెలీక ఓ తండ్రి ఎలా ఆందోళన చెందుతాడో ప్రకాశ్‌రాజ్ హావభావాల్లో చూడాల్సిందే. అలాగే కొడుకు మృతి వార్తను టీవీలో చూసి, షాక్‌కు గురైన ఆ తల్లి తల్లడిల్లిపోతూ, ఆ వార్తను నమ్మకుండా కొడుకు వస్తున్నాడేమోనని రోడ్డుమీదకు పరిగెత్తే సీన్‌లో రేవతి నటన అద్భుతం! సందీప్ పై అధికారిగా మురళీశర్మ, హోటల్‌లో బందీ అయిన హైదరాబాద్ మహిళ ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిపాళ తమ పాత్రలకు అత్యుత్తమంగా న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు తమ పాత్రలకు సరిపోయారు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
'మేజర్' ఒక మంచి సినిమా మాత్రమే కాదు, ఒక గొప్ప సినిమా. ఎన్నెన్నో బాధ్యతారహిత సినిమాల మధ్య తెలుగు సినిమా పరిశ్రమ తీసిన ఒక బాధ్యతాయుత సినిమా. చూసే అవకాశం వస్తే.. ఏమాత్రం మిస్ చేయకూడని సినిమా. ఇది తప్పకుండా చూడాల్సిన, తోటివారికి చూపించాల్సిన మన సినిమా.
రేటింగ్ 4.5/5
- బుద్ధి యజ్ఞమూర్తి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



