రాజమౌళి డైరెక్షన్‌లో 'లోకం చుట్టిన వీరుడు'గా మహేశ్!
on Sep 13, 2022

ఇంతదాకా టాలీవుడ్‌లో రాని హీరో-డైరెక్టర్ కాంబినేషన్‌లలో మహేశ్-రాజమౌళి కాంబినేషన్ ఒకటి. వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడు పనిచేస్తారా అని సినీ ప్రియులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్‌లో సినిమా మొదలు కానున్నదనే వార్త అభిమానుల్లో అమిత ఉత్సాహాన్ని నింపింది. చాలా ఏళ్ల క్రితమే ఈ కాంబినేషన్‌తో సినిమా నిర్మించడానికి నిర్మాత కె.ఎల్. నారాయణ ప్లాన్ చేశారు. ఇన్నాళ్లకు కానీ అది వాస్తవరూపం దాల్చడం లేదు.
మొదట 'బాహుబలి', తర్వాత 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో రాజమౌళి బిజీ అవడం, మహేశ్ వేరే దర్శకులతో పనిచేస్తూ రావడం వల్ల ఆ కాంబినేషన్ సినిమా కోసం అభిమానులు వేచి ఉండక తప్పలేదు. ఇప్పటికి మహేశ్‌తో చేసే సినిమాకు సంబంధించిన లైన్ ఎలా ఉండాలి, ఏ జానర్‌లో ఉండాలనే విషయంలో రాజమౌళి ఓ క్లారిటీకి వచ్చారు. తండ్రి విజయేంద్రప్రసాద్‌తో కూర్చొని, స్టోరీ లైన్‌ను ఖరారు చేశారు. ఇంకోవైపు త్రివిక్రమ్‌తో తన 28వ సినిమాని సోమవారమే సెట్స్ మీదకు తీసుకొచ్చాడు మహేశ్. దాన్ని పూర్తిచేసి, తన 29వ మూవీని రాజమౌళి డైరెక్షన్‌లో చేయాలని డిసైడ్ అయ్యాడు.
కాగా, టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న రాజమౌళి, తన తదుపరి సినిమా ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. మహేశ్‌తో చేసే సినిమా 'గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వంచర్' అని చెప్పారు. అంటే ప్రపంచాన్ని చుట్టివచ్చే ఒక సాహసవంతుని కథగా ఈ సినిమా ఉండబోతోందన్న మాట. గతంలో ఎంజీఆర్ 'లోకం చుట్టిన వీరుడు' అనే సినిమా చేశారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలో మహేశ్ లోకం చుట్టిన వీరునిగా కనిపించనున్నాడనేది స్పష్టం.
ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ అద్భుతః అనిపించే కథను సిద్ధం చేస్తున్నారు. నిధి వేట ప్రధానంగా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌తో ఆయన ఈ కథ రాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే జేమ్స్‌బాండ్ తరహా కథను ఇంకోదాన్ని కూడా ఆయన రాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఓ కథతో మహేశ్-రాజమౌళి ముందుకు వెళ్లనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



