'జనగణమన'ను మర్చిపోండి.. వేడుకను ఎంజాయ్ చేయండి!
on Sep 13, 2022

విజయ్ దేవరకొండ హీరోగా 'జనగణమన' సినిమాని అనౌన్స్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్, 'లైగర్' సినిమా విడుదలకు ముందే ఓ చిన్న షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు స్వయంగా తెలిపారు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్, ఆకాశాన్నంటిన అంచనాలతో విడుదలైన 'లైగర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ సినిమా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నిండా మునిగిపోయారు. ఈ నేపథ్యంలో 'జనగణమన' ప్రాజెక్ట్‌పై రకరకాల ఊహాగానాలు రావడం మొదలైంది.
ఆ సినిమా ఇక అటకెక్కినట్లేనని కొంతమందీ, ముందు అనుకున్న బడ్జెట్‌ను సగానికి తగ్గించేశారనీ ఇంకొంతమందీ ప్రచారంలోకి తెచ్చారు. అయితే నిర్మాతలైన పూరి, ఛార్మి.. ఇద్దరూ 'జనగణమన' గురించి 'లైగర్' మూవీ తర్వాత ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. రూమర్స్‌పై చార్మి "@PuriConnects will bounce back.. Bigger and Better..." అంటూ ఓ ట్వీట్ చేశారు కానీ 'జనగణమన' గురించి ప్రస్తావించలేదు. ఆ తర్వాత మరోసారి, "Rumours rumours rumours! All rumours are fake! Just focusing on the progress of 𝐏𝐂 .. Meanwhile, RIP rumours !!" అని రాసుకొచ్చారు. అప్పుడూ మూవీ గురించి ఏమీ అప్‌డేట్ ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో మరో ఆసక్తికరమైన ఘటన బెంగళూరులో జరుగుతోన్న 'సైమా' వేడుకల్లో చోటు చేసుకుంది. అక్కడి మీడియా 'జనగణమన' గురించి ప్రశ్నించడంతో, "అందరూ ఇక్కడికి సైమా ఈవెంట్‌ను ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అందువల్ల ఇక్కడ దాని (జనగణమన) గురించి మర్చిపోయి, ఈవెంట్‌ను ఎంజాయ్ చెయ్యండి" అన్నాడు విజయ్ దేవరకొండ. అతడి వ్యాఖ్యలు రకరకాల ఊహాగానాలకు తావిచ్చాయి. పలువురు 'జనగణమన ఆగిపోయినట్లుంది.. అందుకే విజయ్ అలా మాట్లాడాడు' అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం 'సైమా వేడుకల్లో జనగణమన గురించి మాట్లాడటం ఇష్టంలేకే అతనలా అన్నాడు' అంటూ విజయ్‌ను వెనకేసుకు వస్తున్నారు.
నిజానికి 'జనగణమన' మూవీ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. దాన్ని మహేశ్‌తో తియ్యాలనుకున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' ఇండస్ట్రీ హిట్ కాగా, 'బిజినెస్‌మేన్' మంచి హిట్టయింది. ఆ తర్వాత 'జనగణమన' ప్లాన్ చేశాడు పూరి. కానీ ఎందుకనో మహేశ్ ఆ స్టోరీపై ఇంటరెస్ట్ చూపించలేదు. దాంతో 'లైగర్' తర్వాత విజయ్ దేవరకొండతో ఆ మూవీని సెట్స్ మీదకు తెచ్చాడు పూరి. 'లైగర్' బాక్సాఫీస్ రిజల్ట్ దీనిపై పడిందనీ, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనీ రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే అసలు నిజం ఏమిటో తెలియనున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



