కృష్ణ చివరిచూపు కోసం వచ్చిన అభిమానులకు అన్నం పెట్టిన మహేశ్!
on Nov 17, 2022

హీరో కృష్ణ మృతితో తెలుగు చిత్రసీమకు సంబంధించిన ఒక శకం ముగిసినట్లయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజులది ఒక శకం. వీరిలో ఇప్పటికే ఎన్టీఆర్, శోభన్‌బాబు, ఏఎన్నార్, కృష్ణంరాజు కాలం చేయగా, ఇప్పుడు కృష్ణ కన్నుమూశారు. కృష్ణంరాజు ఇటీవలే సెప్టెంబర్ 11న మృతి చెందారు. కృష్ణ, కృష్ణంరాజు.. ఇద్దరూ "ఏరా.. ఏరా" అని పిలుచుకొనేంత స్నేహితులు. తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు ఒరిజినల్ సూపర్‌స్టార్‌గా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో.. కృష్ణే.
అందుకే ఆయనను కడసారి దర్శించుకొనేందుకు ఎక్కడెక్కడి నుంచో ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. వారిలో స్త్రీలు సైతం అనేకమంది ఉన్నారు. అభిమానుల తాకిడితో బుధవారం ఆయన పార్థివ దేహం ఉంచిన పద్మాలయా స్టూడియోస్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో తండి చితికి నిప్పుపెట్టి అంత్యక్రియలు నిర్వహించాడు మహేశ్. ఇవి తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
కాగా.. తండ్రి అభిమానులకు కష్టం కలగకూడదనే ఉద్దేశంతో, మహేశ్ వారికి భోజన ఏర్పాట్లు చేయించాడు. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా ఎక్కడెక్కడి నుంచో తండ్రిని చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ ఆకలితో బాధ పడకూడదని వారికి భోజనం పెట్టి పంపించాడు. ఈ విషయాన్ని పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పుడవి వైరల్‌గా మారాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



