పాన్ ఇండియా మూవీ కోసం మహేష్- త్రివిక్రమ్‌ల కసరత్తు!
on Dec 29, 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటివరకు కేవలం తెలుగు మార్కెట్ పైన దృష్టి సారించారు. కానీ స్పైడర్ చిత్రంతో కోలీవుడ్‌లో పాగా వేయాలనుకున్నారు. కానీ అది నిరాశనే మిగిల్చింది. ఇక ఇప్పుడు మహేష్‌బాబుకు సమకాలీకులైన ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్స్ పాన్ ఇండియా జపం జపిస్తుండడంతో మహేష్ కూడా తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తీస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ఆయన ఈ చిత్రంతోనే పాన్ ఇండియా రేస్‌లోకి ఎంటర్ కావాలా? లేక దీని తర్వాత ఆయన ఎలాగూ దర్శకధీరుడు రాజమౌళితో భారీ చిత్రం చేయనున్నాడు కాబట్టి ఆ మూవీతో స్టార్ట్ చేయాలా? అనే సందిగ్దంలో ఉన్నారట.
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిన ప్రభాస్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు రాజమౌళి చిత్రాల ద్వారనే పాన్ ఇండియా లెవల్లో పాగా వేశారు. బన్నీ మాత్రం సుకుమార్ పుష్పతో ఎంటర్ అయ్యారు. కాగా మహేష్ ఆలోచనలను పసిగట్టిన త్రివిక్రమ్ మహేష్ రాబోయే చిత్రం కోసం ఇతర భాష నటీనటులను కూడా తీసుకొని సినిమాకు వేరే భాషల్లో కూడా హైప్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. సూపర్ స్టార్ మహేష్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి దాదాపు దశాబ్ద కాలం తర్వాత చేస్తోన్న సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. మూడవ సినిమా కోసం షూటింగ్ జరుగుతోంది. సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ప్రతి అప్డేట్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకొని హిందీ మార్కెట్ పై కన్నేసిన త్రివిక్రమ్ మరో కీలక పాత్రకు తమిళ నటుడు విక్రమ్ ప్రభుని తీసుకున్నారని సమాచారం.
విక్రమ్ ప్రభు తమిళంలో సోలో సినిమాలే కాదు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ఇటీవల ఆయన పొన్నియన్ సెల్వం1 లో కూడా తన పాత్రకు మంచి న్యాయం చేసి అద్భుతంగా నటించారు. ఇప్పుడు మహేష్ సినిమాలో అతను భాగస్వామ్యం అవుతున్నారని సమాచారం. ఈ మూవీలో అతను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాలోని పాత్రను నచ్చడంతో అతను వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వార్త కనుక నిజమైతే విక్రమ్ ప్రభు ఎంట్రీతో ఈ సినిమాకి తమిళ మార్కెట్ కి మరింత ఊపు వస్తుంది. ఇంకా బాలీవుడ్ మార్కెట్ కి పూజా హెగ్డే తో పాటు టబు చేస్తున్న పాత్ర కూడా సరైన హైప్ ఇస్తుందనే ఆశ భావాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మహేష్- త్రివిక్రమ సినిమా అనేసరికి అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మూవీ తర్వాత మహేష్- రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ద్వారా అతను నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్ పై దృష్టి సారించారని అంటున్నారు. మరి మహేష్ అప్పటిదాకా వెయిట్ చేస్తారా లేక త్రివిక్రమ్ తో పాన్ ఇండియకు బాటలు వేసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



