మారాల్సింది ప్రేక్షకులా? నానినా?
on Dec 15, 2023

కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేసే హీరోగా నేచురల్ స్టార్ నానికి పేరుంది. అయితే నాని కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది. నాని నటించిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తుంటే.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం పేరుకి తగ్గట్టుగా వసూళ్లు రాక అతికష్టం మీద బ్రేక్ ఈవెన్ అందుకొని హిట్స్ అనిపించుకుంటున్నాయి.
నాని కెరీర్ లో 'నేను లోకల్', 'MCA(మిడిల్ క్లాస్ అబ్బాయి)', 'దసరా' వంటి కమర్షియల్, మాస్ సినిమాలు టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి. రూ.35 కోట్ల షేర్ తో నేను లోకల్, రూ.40 కోట్ల షేర్ తో MCA, రూ.63 కోట్ల షేర్ తో దసరా సత్తా చాటాయి. కానీ గొప్ప చిత్రాలుగా పేరు తెచ్చుకున్న కొన్ని సినిమాలు మాత్రం ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయాయి.

నాని కెరీర్ లో ఉత్తమ చిత్రం అంటే ఎక్కువ మంది చెప్పే పేరు 'జెర్సీ'. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్ల లోపు షేరే రాబట్టింది. అలాగే 'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి కూడా మంచి పేరు వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం రూ.30 కోట్ల షేర్ దాటలేదు. ఇక 'గ్యాంగ్ లీడర్', 'అంటే సుందరానికీ' వంటి సినిమాల పరిస్థితి మరీ దారుణం. విడుదలైనప్పుడు ప్రేక్షకులు ఆదరించలేదు. కానీ తర్వాత మాత్రం మంచి సినిమాలుగా ప్రశంసలు అందుకున్నాయి. ఇటీవల విడుదలైన 'హాయ్ నాన్న'కు మంచి పేరు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా రూ.30 కోట్ల షేర్ కే పరిమితమయ్యే అవకాశముంది.

మిగతా హీరోలతో పోలిస్తే నాని ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ప్రేక్షకులు మాత్రం ఓ మోస్తరు విజయాలనే అందిస్తున్నారు. అదే ఆయన రెగ్యులర్ మాస్ సినిమా చేస్తే మాత్రం బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. మరి భవిష్యత్ లో నాని కూడా ఎక్కువగా కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపుతాడో లేక ఇదే బాటలో పయనిస్తూ ప్రేక్షకులనే తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



