లతా మంగేష్కర్ పాటల ప్రయాణం.. 1962లో ఆమెపై విష ప్రయోగం!
on Feb 6, 2022

లెజెండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్(92) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. లత 1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా(ఐదుగురిలో) జన్మించారు. ఐదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతం తప్ప మరోలోకం లేదు. ఆమె తండ్రి అనారోగ్య సమస్యలతో 1942లో మరణించారు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది.
లతా మంగేష్కర్ తండ్రి మరణించడంతో, నవయుగ్ చిత్రపత్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు. గాయనిగా, నటిగా లత కెరీర్ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. 'నాచు య గడే' అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్ (1942) కోసం పాడారు లత. ఈ పాట ఆమె మొదటి పాట. కానీ ఆ పాటని సినిమా నుంచి తొలగించారు. నవయుగ చిత్రపత్ బ్యానర్ లో తీసిన మరాఠీ సినిమా పహలీ మంగళా-గౌర్ (1942) సినిమాలో ఒక పాత్ర పోషించారు. ఈ సినిమాలో దాదా చందేకర్ స్వరపరచిన 'నటాలీ చైత్రాచీ నవలాయీ' పాట కూడా పాడారు. మరాఠీ సినిమా గజబాహు (1943) లో 'మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దే తూ' ఆమె పాడిన మొదటి హిందీ పాట. మహల్ (1949) సినిమాలోని 'ఆయేగా ఆనేవాలా' పాటతో మొదటి హిట్ అందుకున్నారు లతా. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వేల పాటలకు ప్రాణం పోశారు.
1962లో లతా మంగేష్కర్ పై విష ప్రయోగం జరిగింది. ఆమెకు స్లోపాయిజన్ ఇచ్చారని డాక్టర్ నిర్ధారించారు. మూడు రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తరువాత ఆమె కోలుకున్నారు. కానీ ఈ విష ప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. మూడు నెలల వరకూ ఆమె మంచంపైనే ఉన్నారు.
1963 జనవరి 27లో చీనా-భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ ఎదుట 'అయే మేరే వతన్ కే లోగో'(నా దేశ ప్రజలారా) పాట పాడారు లత. ఈ పాట సి.రామచంద్ర స్వరపరచగా, కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా లతా మంగేష్కర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించారు. ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు.
భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం. 1969 లో పద్మభూషణ్, 1999 లో పద్మవిభూషణ్, 2001 లో భారతరత్న పురస్కారాలను ఆమె అందుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



