తగ్గని విజయ్ క్రేజ్.. రికార్డు స్థాయిలో 'ఖుషి' బిజినెస్!
on Nov 8, 2022

భారీ అంచనాలతో విడుదలైన విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్' ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొంది, పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ చిత్రం బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. 'లైగర్' రిజల్ట్ తో మూవీ టీమ్ తీవ్ర నిరాశ చెందింది. విజయ్ తదుపరి సినిమాలపైన సైతం ఈ ప్రభావం చూపనుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే 'లైగర్' వంటి డిజాస్టర్ తర్వాత కూడా విజయ్ తదుపరి సినిమా బిజినెస్ రికార్డు స్థాయిలో జరగడం సంచలనంగా మారింది.
విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కూడా ఆకట్టుకున్నాయి. అయితే 'లైగర్' డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రభావం 'ఖుషి'పై పడుతుందని భావించారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 'ఖుషి' నాన్-థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్టు తెలుస్తోంది. తెలుగు, హిందీతో పాటు అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.90 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. విజయ్-సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడం కూడా 'ఖుషి' హైప్ కి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న విడుదల చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



