కృష్ణంరాజు నటప్రస్థానానికి 55 ఏళ్ళు
on Jun 10, 2021

రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తెలుగునాట ఈ పేరే ఒక బ్రాండ్. అలాంటి కృష్ణంరాజుకి జూన్ 10 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఐదున్నర దశాబ్దాల క్రితం సరిగ్గా ఇదే రోజున ఆయన వెండితెరపై తొలి అడుగులేశారు. `చిలకా గోరింకా` అంటూ తెలుగు ప్రేక్షకులను మొదటిసారిగా పలకరించారు. తొలి చిత్రమే కృష్ణకుమారి వంటి అగ్ర కథానాయికకి జంటగా నటించడం ఒక విశేషమైతే.. స్టార్ డైరెక్టర్ ప్రత్యగాత్మ స్వయంగా నిర్మించి మరీ ఈ సినిమాని రూపొందించడం మరో విశేషం. అలాగే, శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాస రావు) వంటి మేటి రచయిత ఈ చిత్రంలోని గీతాలకి సాహిత్యం అందించడం ఇంకో విశేషం. ఇక ఇదే సినిమాతో ప్రముఖ హాస్య నటి రమాప్రభ కూడా తెలుగు తెరకు పరిచయమవడం.. కృష్ణంరాజుకి చెల్లెలి పాత్రలో ఆమె నటించడం మరో విశేషం. అంతేకాదు.. ఎస్వీ రంగారావు, అంజలీ దేవి వంటి హేమాహేమీలున్న ఈ సినిమాలో.. పతాక సన్నివేశాల్లో ఎలాంటి బెరుకు లేకుండా ఎస్వీఆర్ కాంబినేషన్ లో తనదైన అభినయంతో మెప్పించారు కృష్ణంరాజు.
దిగ్గజ స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు సంగీతమందించిన ఈ చిత్రంలో.. కృష్ణంరాజు, కృష్ణకుమారిపై చిత్రీకరించిన ``ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి`` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అదేవిధంగా ``నా రాణి కనులలోనే``, ``నేనే రాయంచనై``, ``పాప కథ విను`` పాటలు కూడా వినసొంపుగా ఉంటాయి. `ద్వితీయ ఉత్తమ చిత్రం` విభాగంలో `నంది` పురస్కారం దక్కించుకున్న `చిలకా గోరింకా`.. ముగ్గురు జంటల (ఎస్వీఆర్ - అంజలీదేవి, కృష్ణంరాజు - కృష్ణకుమారి, పద్మనాభం - రమాప్రభ) ప్రేమానురాగాలను చక్కగా ఆవిష్కరించడమే కాకుండా జీవితానికి అర్థం, పరమార్థం చెప్పే ప్రయత్నంలా తెరకెక్కిందనే చెప్పాలి. 1966 జూన్ 10న విడుదలైన `చిలకా గోరింకా`.. నేటితో 55 వసంతాలు పూర్తిచేసుకుంది. అంటే.. ఇవాళ్టితో కృష్ణంరాజు నటప్రస్థానానికి 55 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



