మెగాస్టార్ `ఖైదీ నంబర్ 786`కి 33 ఏళ్ళు
on Jun 10, 2021

మెగాస్టార్ చిరంజీవికి `ఖైదీ` సంబంధిత టైటిల్స్ బాగా అచ్చొచ్చాయి. 1983లో తెరకెక్కిన `ఖైదీ` చిరు నటజీవితాన్నే మేలిమలుపు తిప్పితే.. 1988లో వచ్చిన `ఖైదీ నంబర్ 786` తన కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రి-ఎంట్రీ మూవీగా రూపొందిన 2017 నాటి `ఖైదీ నంబర్ 150` అయితే గ్రాండ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది. ఇలా.. టైటిల్ లో `ఖైదీ` ఉండటం మెగాస్టార్ కి పాజిటివ్ సెంటిమెంట్ గా మారింది. కాగా, వీటిలో రెండో చిత్రమైన `ఖైదీ నంబర్ 786` విడుదలై నేటికి 33 ఏళ్ళు. ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాల్లోకి వెళితే..
తమిళ నాట ఘనవిజయం సాధించిన `అమ్మన్ కోవిల్ కీళక్కాలే` (విజయకాంత్, రాధ)కి రీమేక్ గా `ఖైదీ నంబర్ 786` రూపొందింది. ఈ సినిమాలో చిరుకి జంటగా భానుప్రియ నటించగా మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. సిల్క్ స్మిత ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. చిరంజీవి ఫేవరేట్ డైరెక్టర్స్ లో ఒకరైన విజయ బాపినీడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు.
రాజ్ - కోటి సంగీతసారధ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా.. ``గువ్వా గోరింకతో``, ``అటు అమలాపురం`` అప్పట్లో సంచలనం సృష్టించాయి. విశేషమేమిటంటే.. ఈ రెండు పాటలను కూడా మెగా కాంపౌండ్ హీరోలు రీమిక్స్ చేశారు. `సుబ్రమణ్యం ఫర్ సేల్` (2015) కోసం ``గువ్వా గోరింకతో``ని సాయితేజ్ రీమిక్స్ చేయగా.. ``అటు అమలాపురం``ని `కొత్త జంట` (2014) కోసం అల్లు శిరీష్ రీమిక్స్ చేశాడు.
1988 జూన్ 10న విడుదలైన `ఖైదీ నంబర్ 786`.. నేటితో 33 వసంతాలను పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



