రమ్యకృష్ణ 'శివగామి' క్యారెక్టర్‌పై కృష్ణవంశీ కామెంట్ ఏంటి?
on Aug 28, 2020

నటిగా రమ్యకృష్ణ గురించి చెప్పమంటే చాలామందికి రెండు పాత్రలు గుర్తుకు వస్తాయి. ఒకటి.. 'నరసింహా' చిత్రంలో చేసిన నీలాంబరి క్యారెక్టర్ అయితే, రెండోది.. 'బాహుబలి'లో చేసిన శివగామి పాత్ర. భల్లాలదేవ కన్నతల్లి అయినప్పటికీ, తోడికోడలు కుమారుడైన అమరేంద్ర బాహుబలికి సైతం స్తన్యమిచ్చి పెంచి, కొడుకు కంటే అతడినే ఎక్కువగా ప్రేమించి, అతడిని మాహిష్మతి సామ్రాజ్యానికి చక్రవర్తిగా చూడాలని ఆశించే పాత్ర శివగామి. అయితే కొడుకు భల్లాలదేవ, భర్త బిజ్జలదేవ పన్నిన పన్నాగంలో పావుగా మారి, బాహుబలిని దూరం చేసుకొని, అతడి మరణానికి కారకురాలవుతుంది. తనవల్ల జరిగిన తప్పు తెలుసుకొని, పశ్చాత్తాపపడి అమరేంద్ర బాహుబలి కొడుకు మహేంద్ర బాహుబలిని శిశువుగా ఉన్నప్పుడు అతడి ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను సమర్పిస్తుంది.
అలాంటి వీరం, రౌద్రం కలగలసిన శక్తిమంతమైన శివగామి పాత్రను రమ్యకృష్ణ పోషించిన తీరు అమోఘం. నిజానికి ఆ పాత్రను మొదట ఆఫర్ చేసింది శ్రీదేవికి. ఆమె తిరస్కరించడంతో అనుకోకుండా దాన్ని చేజిక్కించుకొని అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన సినిమాలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించిందనే పేరు తెచ్చుకున్నారు రమ్యకృష్ణ. ఆ పాత్రను ఆమె చేసిన తీరుపై భర్త కృష్ణవంశీ స్పందన ఏమిటి?

'బాహుబలి'ని చూసినప్పుడు అది రాజమౌళి, విజయేంద్రప్రసాద్ కాంబినేషన్ సృష్టించిన గ్రేటెస్ట్ క్రియేషన్ అని ఆయనకు అనిపించింది. "రమ్య గొప్ప నటి. దానిని కాదనలేం. దొరక్క దొరక్క శివగామి లాంటి బలమైన పాత్ర దొరికింది. తన నటనతో తినేసిందంతే. ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళి, ఆయన తండ్రికే దక్కుతుంది. శివగామి పాత్రలో ఎక్కడేం చెయ్యాలో అక్కడ పర్‌ఫెక్టుగా చేసింది రమ్య." అని చెప్పారు కృష్ణవంశీ. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న 'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాశ్‌రాజ్ భార్య పాత్రను రమ్యకృష్ణ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



