యంగ్ హీరోలకు అన్యాయం జరుగుతోంది.. కిరణ్ అబ్బవరం ఆవేదన!
on Oct 9, 2025
ఒకప్పుడు ఒక భాషలో తీసిన సినిమాలను ఆ భాషలోనే రిలీజ్ చేసేవారు. హిట్ అయిన సినిమాల రైట్స్ తీసుకొని ఇతర భాషల్లో రీమేక్ చేసేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. యూనివర్సల్ అప్పీల్‌తోనే కథలు ఎంపిక చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమాలోని ఆర్టిస్టుల ఎంపిక కూడా జరుగుతోంది. అయితే ఇది భారీ బడ్జెట్ సినిమాల విషయంలోనే జరుగుతోంది. ఇక ప్రతి భాషలోనూ తక్కువ బడ్జెట్ సినిమాలు, యూత్ సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. వాటిని కూడా ఇతర భాషల్లోకి అనువదించి రిలీజ్ చేస్తున్నారు. అలా ఇటీవలికాలంలో ఎన్నో పరభాషా చిత్రాలు తెలుగులో రిలీజ్ అయి ఘనవిజయం సాధించాయి. సినిమా పుట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు అన్ని భాషా చిత్రాలను ఆదరించాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. హీరో ఎవరు, ఏ భాష నుంచి వచ్చిన సినిమా అనేది చూడకుండా కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను సూపర్‌హిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. కొన్ని రాష్ట్రాల ఫిలిం ఇండస్ట్రీలలో తెలుగు సినిమా అంటే తక్కువ అనే భావన ఇప్పటికీ వుంది. కొన్ని సినిమాలను వారి వారి రాష్ట్రాల్లో విడుదల కాకుండా చేస్తున్నారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్లుగానీ, ఎగ్జిబిటర్లుగానీ మన చిన్న సినిమాలను పక్కన పెడుతున్నారు. ఆ సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారు. దీంతో కొన్ని తెలుగు సినిమాలకు రావాల్సినంత రెవిన్యూ రావడం లేదు. దాని వల్ల చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం కీలక వ్యాఖ్యలు చేశారు.
‘తెలుగు హీరోలు చేసిన సినిమాలకు ఇతర రాష్ట్రాల్లో థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారు. తమిళనాడులో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అక్కడ థియేటర్లు దొరకడం చాలా కష్టంగా మారింది. నేను నటించిన ‘క’ చిత్రం గత ఏడాది దీపావళికి రిలీజ్ అయింది. తమిళనాడులో మాత్రం రిలీజ్ అవ్వలేదు. అక్కడ స్క్రీన్స్ ఇవ్వకపోవడమే దానికి కారణం. తమిళ్ నుంచి వచ్చే యంగ్ హీరోల సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కానీ, మనకు మాత్రం థియేటర్ల విషయంలో అక్కడ అన్యాయం జరుగుతోంది. చాలా మంది తమిళ హీరోలకు తెలుగులో అభిమానులు ఉన్నారు. వారి సినిమాలను ఎంతో ఆదరిస్తారు. దానికి ప్రతిఫలంగా మన సినిమాలను కూడా వాళ్లు ఆదరించాలని కోరుకుంటున్నాం’ అన్నారు కిరణ్ అబ్బవరం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



