ENGLISH | TELUGU  

'కనులు కనులను దోచాయంటే' మూవీ రివ్యూ 

on Feb 28, 2020

నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ, గౌతమ్ మీనన్, రక్షణ్, నిరంజని తదితరులు
సినిమాటోగ్రఫీ:  కె.యం. భాస్కరన్    
స్వరాలు: మసాలా కాఫీ
నేపథ్య సంగీతం: హర్షవర్షన్ రామేశ్వరన్ 
నిర్మాతలు: వయాకామ్ 18 పిక్చర్స్, అంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ సంస్థలు
తెలుగులో విడుదల: కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం: దేసింగ్ పెరియసామి
విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2020

'ఓకే బంగారం', 'మహానటి' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయకుడు దుల్కర్ సల్మాన్. ఆయన నటించిన తాజా చిత్రం 'కనులు కనులను దోచాయంటే'. హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి. 

కథ:

సిద్ అలియాస్ సిద్ధార్థ్ (దుల్కర్ సల్మాన్), కల్లీస్ (రక్షణ్) స్నేహితులు. పైకి మొబైల్ అప్లికేషన్ డెవలపర్, యానిమేటర్ అని చెప్పుకుంటారు. కానీ, ఇద్దరు పెద్ద మోసగాళ్లు. టెక్నాలజీ ఉపయోగించి వివిధ రకాల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోసాలు చేస్తూ జాలీగా, హ్యాపీగా జీవిస్తుంటారు. అప్పుడప్పుడూ తమ ఎదురింటికి వచ్చి వెళుతుండే ఫ్రీలాన్స్ బ్యూటీషియన్ మీరా (రీతూ వర్మ)తో సిద్ ప్రేమలో పడతాడు. మీరా స్నేహితురాలు శ్రేయ (నిరంజని)ని కల్లీస్ ప్రేమిస్తాడు. సిద్ చేసిన ఒక మోసం వల్ల డిసిపి ప్రతాప్ సింహ (గౌతమ్ మీనన్) ఇంట్లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంటుంది. ప్రమాదం చిన్నదైనా దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని దర్యాప్తు ప్రారంభిస్తాడు. కొత్తగా మరో మోసం చేయబోయి ప్రతాప్ సింహ పన్నిన వల నుండి సిద్ తృటిలో తప్పించుకుంటాడు. మోసాలన్నీ ఆపేసి అప్పటివరకు కూడబెట్టిన డబ్బుతో గోవా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటాడు. సిద్, మీరా, కల్లీస్, శ్రేయ... నలుగురు గోవా వెళతారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఒక క్లూ పట్టుకుని ప్రతాప్ సింహ గోవా వెళ్లి... అక్కడ సిద్, కల్లీస్ ను పట్టుకుంటాడు. అయితే... అమ్మాయిలు ఇద్దరు అక్కడ ఉండరు. వాళ్లు ఎలా అదృశ్యమయ్యారు? వాళ్ల అదృశ్యం వెనుక ఉన్న కథేంటి? మళ్లీ సిద్, కల్లీస్ ని ఎలా కలిశారు? అసలు, ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.    

విశ్లేషణ:

ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. అయితే... చిత్రంలో రొమాన్స్ కంటే థ్రిల్ ఎక్కువ ఉంటుంది. ప్రేమకథలో లోతైన సన్నివేశాలు, హృదయానికి హత్తుకునే భావనలు కొరవడ్డాయి. ప్రారంభంలో ఒక పదిహేను నిమిషాలు కథానాయకుడి జీవనశైలి, విధానం చూపించడానికి దర్శకుడు సమయం తీసుకున్నాడు. ఆ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవు. తర్వాత నిదానంగా అసలు కథలోకి వెళ్లడం ప్రారంభించాడు. కథానాయకుడు చేసే మోసాలు చూస్తుంటే.... ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. థియేటర్లలో ప్రేక్షకులు ఆలోచనలో పడతారు. అలా అలా అలా సినిమా విశ్రాంతికి చేరుకుంటుంది. విశ్రాంతికి ముందు ప్రేక్షకులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఒకటి వస్తుంది. విశ్రాంతి తర్వాత నుండి కథలో వేగం మరింత పుంజుకుంది. హీరో వేసే ఎత్తులు, పై ఎత్తులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు కూడా కథను పరుగులు పెట్టించాడు. కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. ద్వితీయార్థంలో వచ్చే ప్రతి మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకు మించి ఎక్కువ చెబితే థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులకు థ్రిల్ మిస్ అవుతుంది. ఈ చిత్రంలో లోపల విషయానికి వస్తే... పాటలు కథా గమనానికి కాస్త అడ్డుతగిలాయని చెప్పాలి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం మాత్రం చిత్రానికి బలంగా నిలిచింది. ఉత్కంఠతో ప్రేక్షకుడు ఫీలయ్యేలా మంచి నేపథ్య సంగీతం అందించారు. ముఖ్యంగా వినోదంలో తమిళ వాసనలు ఎక్కువయ్యాయి. తమిళంలో పాపులర్ అయినా రజనీకాంత్ డైలాగులను హీరో స్నేహితుడి చేత పేరడీ చేయించినట్లు ఉన్నారు. తెలుగులోకి ఆ వినోదం యధాతధంగా తర్జుమా కాలేదు. సంభాషణలు కూడా బాలేదు. తెలుగు లో డైలాగులు రాసింది ఎవరో కానీ 'బ్రేక్ ఫాస్ట్ కి భావన... లంచ్ కి లావణ్య', ' 'అమ్మాడి అమ్మాడి అంటూ గున్న గున్న మామిడి సాంగ్ వేశారు' అంటూ సంభాషణల్లో ప్రాసకోసం పాకులాడారు. 

ప్లస్‌ పాయింట్స్‌:
కథ, కథలో మలుపులు 
రీతూ వర్మ నటన 
దుల్కర్-రీతూ జోడి
ద్వితీయార్థం 
నేపథ్య సంగీతం

మైనస్‌ పాయింట్స్‌:
ప్రథమార్థంలో ప్రారంభ సన్నివేశాలు
వినోదంలో తమిళ వాసనలు
లాజిక్కులు లేని కొన్ని సన్నివేశాలు
తెలుగు సంభాషణలు

నటీనటుల పనితీరు:

దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జోడి చూడముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. ముఖ్యంగా రీతూవర్మ నటన ఈ చిత్రానికి బలం అని చెప్పాలి. మిగతా నటీనటులు అందరు బాగా చేశారు. అయితే... అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం గౌతమ్ మీనన్ గురించే. తెరపై కనిపించిన ప్రతిసారీ తన నటనతో ఆయన ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. పోలీస్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు.

తెలుగుఒన్‌ పర్ స్పెక్టివ్‌:

'కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దాని అర్థం' - మణిరత్నం దర్శకత్వం వహించిన దొంగ దొంగ చిత్రంలో పాటలోని లైన్ ఇది. టైటిల్ బట్టి హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారని సులభంగా ఊహించవచ్చు. శుక్రవారం సాయంత్రానికి కథలో మలుపులను ఎవరైనా బయటకు చెప్పేయవచ్చు. మలుపులు తెలిసినా... ఊహించగలిగినా... తెర పై వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. ఒక మంచి చిత్రం చూశామనే అనుభూతిని అందిస్తాయి. ఆన్ లైన్ మోసాలపై చిన్నపాటి హెచ్చరిక చేస్తోందీ సినిమా. అపరిచిత అమ్మాయిలతో మాట్లాడుకునే అబ్బాయిలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సందేశం ఇస్తుంది.

రేటింగ్‌: 3/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.