ENGLISH | TELUGU  

హిట్టయినట్టే!.. 'హిట్' మూవీ రివ్యూ

on Feb 28, 2020

 

సినిమా పేరు: హిట్
తారాగణం: విష్వక్ సేన్, రుహానీ శర్మ, భానుచందర్, మురళీ శర్మ, బ్రహ్మాజీ, చైతన్య, హరితేజ
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: మణికందన్
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
ఆర్ట్: అవినాష్ కొల్లా
స్టంట్స్: నభా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం
సమర్పణ: నాని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన-దర్శకత్వం: డాక్టర్ శైలేష్ కొలను
బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా
విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2020

'ఫలక్‌నుమా దాస్' మూవీతో లైంలైట్‌లోకి వచ్చిన హైదరాబాదీ యాక్టర్ విష్వక్ సేన్ హీరోగా నాని ప్రొడక్షన్ కంపెనీ వాల్ పోస్టర్ సినిమా తీస్తున్న మూవీగా 'హిట్' వార్తల్లో నిలిచింది. శైలేష్ కొలను అనే దర్శకుడ్ని పరిచయం చేస్తూ నిర్మించిన ఈ క్రైం థ్రిల్లర్‌ను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయడం నలుగురి దృష్టినీ ఆకర్షించింది. ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ సినిమా గురించి రాజమౌళి సహా పలువురు ప్రశంసలు కురిపించడంతో 'హిట్'లో ఏదో విషయం ఉందనే అభిప్రాయం కలిగింది. ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఆ సినిమా అందుకు తగ్గట్లే ఉందా? చూద్దాం...

కథ: 

సీఐడీ డిపార్ట్‌మెంట్‌లోని 'హిట్' (హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్)లో పనిచేసే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు (విష్వక్ సేన్).. గతంలో తన జీవితంలో జరిగిన ఒక ఘటన వల్ల మానసికంగా పానిక్ ఎటాక్స్‌కు గురవుతుంటాడు. అదే డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అతని గాళ్ ఫ్రెండ్ నేహ (రుహానీ శర్మ) సూచనతో ఆరునెలలు సెలవుపెట్టి రెస్ట్ తీసుకోవాలనుకుంటాడు. అతను సెలవులో ఉండగా నేహ కనిపించడంలేదనే విషయం తెలుస్తుంది. ఆమెను కనిపెట్టాలని, ఆ కేసును టేకప్ చేయాలనుకుంటాడు. కానీ పై అధికారి (భానుచందర్) ఆ కేసును మరో ఆఫీసర్‌కు అప్పగిస్తాడు. అయితే అప్పటికే రెండు నెలలుగా ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న ప్రీతి అనే యువతి మిస్సింగ్ కేసుకూ, నేహ మిస్సింగ్‌కూ లింకు ఉందనే అభిప్రాయంతో ప్రీతి మిస్సింగ్ కేసును టేకప్ చేస్తాడు విక్రమ్. ఆ క్రమంలో అతడు ఎదుర్కొన్న అనుభవాలు, పరిస్థితులు ఏమిటి? నేహ సేఫ్‌గా దొరికిందా? ప్రీతి ఏమయ్యింది? ఈ మిస్టరీ వెనుక ఉన్న హస్తం ఎవరిది?.. ఈ ప్రశ్నలకు సెకండాఫ్‌లో మనకు సమాధానాలు లభిస్తాయి.

విశ్లేషణ:
డైరెక్టర్‌కు శైలేంద్రకు ఇది తొలి సినిమా అంటే నమ్మబుద్ధి కాదు. అంత పకడ్బందీగా స్క్రీన్‌ప్లేను అతను అల్లుకున్నాడు. ఈ కథను, స్క్రీన్‌ప్లేను తయారుచేసుకోవాలంటే ఎంతో రీసెర్చి అవసరం. ఒక మిస్సింగ్ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో, ఎలా చేయవచ్చో ఈ సినిమాలో డైరెక్టర్ చూపించాడు. తొలి పది నిమిషాల సేపు విక్రమ్ ఎదుర్కొనే పానిక్ ఎటాక్స్, దానివల్ల అతడు సఫర్ అవడం కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచీ ప్రీతి మిస్సింగ్ కేసు, ఆ తర్వాత నేహ మిస్సింగ్ కేసు కలిపి ఈ సినిమాని పరుగులెత్తించాయి. క్రైం థ్రిల్లర్ అయిన 'హిట్'.. దానికి తగ్గట్లే తర్వాత ఏం జరుగుతోందో అనే ఉత్కంఠను కలిగించడంలో సక్సెసయ్యింది. కేసును విక్రమ్ దర్యాప్తు చేస్తుంటే, అతడితో పాటు మనమూ ప్రయాణిస్తాం. అయితే మన ఊహలకు, అంచనాలకు అందని రీతిలో కథనాన్ని నడిపి ఆశ్చర్యం కలిగించాడు దర్శకుడు.

విక్రమ్ పాత్రతో పాటు, అతడి స్నేహితుడు రోహిత్ (చైతన్య) పాత్రను కానీ, కథకు కీలకమైన మిగతా పాత్రల్ని కానీ చిత్రించిన విధానం, సన్నివేశాల్ని కల్పించిన తీరూ మనల్ని ఆకట్టుకుంటాయి. పాత్రలూ నమ్మదగ్గ రీతిలో ప్రవర్తిస్తే, సన్నివేశాలూ లాజికల్‌గా అనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ అయిపోయాక మరో పావుగంట సేపు సినిమా చూడాల్సి రావడం మాత్రం కాస్త ఇబ్బందికరం. కథకు అది అవసరమే కానీ, అప్పటిదాకా సినిమా నడిచిన తీరు ఒక విధంగా ఉండి, చివరి పావుగంట ఇంకో రకంగా ఉండటంతో ఒకింత అసహనం కలిగే అవకాశం ఉంది. హీరో హీరోయిన్ల మధ్య మరికొన్ని ఆకర్షణీయమైన సన్నివేశాలకు స్కోప్ ఉన్నా దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. 

టెక్నికల్‌గా మంచి స్టాండర్డ్స్‌లో ఈ సినిమా ఉంది. డైరెక్టర్ శైలేష్ స్క్రీన్‌ప్లేకి వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్, మణికందన్ సినిమాటోగ్రఫీ తోడై సన్నివేశాలకు అవసరమైన థ్రిల్స్‌ను చేకూర్చాయి. సంభాషణలు కూడా ఎక్కువ తక్కువ కాకుండా సన్నివేశాల మూడ్‌కు తగ్గట్లు సాగాయి. విష్వక్ బాడీ లాంగ్వేజ్‌కి అతను చెప్పే డైలాగ్స్ సరిగ్గా సరిపోయాయి. స్ర్కీన్‌ప్లేకి సంబంధించిన ఒక లోటు.. ఎమోషన్స్ కంటే ఇన్వెస్టిగేషన్‌కే ఎక్కువ సన్నివేశాలు కేటాయించడం. విక్రమ్ ఎందుకు అంత పానిక్ అవుతున్నాడనే విషయాన్ని సెకండాఫ్‌లో కొంచెం రివీల్ చేశారు కానీ, అందులో ఎమోషనల్ కంటెంట్ లోపించింది. పైగా కథకు, విక్రమ్ క్యారెక్టర్‌కు కీలకమైన అతని పానిక్ ఎటాక్స్‌కు కారణమైన గతానికి సంబంధించి ప్రశ్నలు కొన్ని అలాగే మిగిలిపోతాయి. ఈ మూవీని 'ఫస్ట్ కేస్'గా పేర్కొని, ముగింపులో 2021లో సెకండ్ కేస్ వస్తుందన్నట్లు చూపారు. అంటే 'హిట్.. సెకండ్ కేస్'లో దాని గురించి చెబుతారేమో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
పకడ్బందీ స్క్రీన్‌ప్లే
విక్రమ్ పాత్ర చిత్రణ, ఆ పాత్రలో విష్వక్ సేన్ నటన
సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్
ఇన్వెస్టిగేషన్ చూపించే తీరు

మైనస్ పాయింట్స్:
ఎమోషనల్ కంటెంట్ లోపించడం
సినిమా ముగింపు సన్నివేశాలు
రిలీఫ్ పాయింట్ లేకపోవడం
హీరోయిన్ పాత్రతో పాటు మరికొన్ని పాత్రల్ని సరిగా మలచకపోవడం

నటీనటుల అభినయం:
విక్రమ్ క్యారెక్టర్‌లో విష్వక్ సేన్ చెప్పుకోదగ్గ నటన ప్రదర్శించాడు. 'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నుమా దాస్' సినిమాల్లో కనిపించిన విష్వక్‌కు పూర్తిభిన్నమైన విష్వక్‌ను ఈ సినిమాలో మనం చూస్తాం. విక్రమ్ గా హావభావాలు, పానిక్ ఎటాక్ అప్పుడు చూపించే అభినయం, ఇన్వెస్టిగేషన్ సందర్భంగా కనిపించే బాడీ లాంగ్వేజ్, ఆ సందర్భంగా ప్రదర్శించే కోపతాపాల విషయంలో అతను మెప్పించాడు. అతని డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకుంది. అతని గాళ్ ఫ్రెండ్ నేహ పాత్రలో రుహానీ ఫర్వాలేదు. ఆమెకు కథలో ఎక్కువ నిడివి లభించలేదు. ఆమెకంటే షీలా అనే పాత్ర చేసిన హరితేజకు ఎక్కువ నిడివి లభించింది. ఇప్పటిదాకా కనిపించని హరితేజను ఈ మూవీలో చూస్తాం. కానీ అది ప్రేక్షకుల్ని అలరించే క్యారెక్టర్ కాదు. ఇబ్రహీం అనే సబ్ ఇన్‌స్పెక్టర్ క్యారెక్టర్ మురళీ శర్మ లాంటి నటుడికి ఇవ్వాల్సింది కాదు. తనకిచ్చిన ఆ చిన్న పాత్రను సునాయాసంగా ఆయన చేశాడు. భానుచందర్, బ్రహ్మాజీ తమకిచ్చిన పాత్రల పరిధి మేరకు చేశారు. విక్రమ్ స్నేహితుడు, అతని సహోద్యోగి రోహిత్ పాత్రలో చైతన్య అనే నటుడు రాణించాడు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
క్రైం థ్రిల్లర్స్ కోసం ఎదురుచూసేవాళ్లను మెప్పించే అంశాలున్న 'హిట్'.. రెగ్యులర్ ఆడియెన్స్‌ను అలరించే విషయంలో కొంత తడబాటుకు గురయ్యింది. ఒక వర్గం ప్రేక్షకుల్ని మాత్రమే ఈ సినిమా ఆకట్టుకొనే అవకాశాలున్నాయి.

రేటింగ్: 2.75/5

- బుద్ధి యజ్ఞమూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.