అడవిలో చిక్కుకుపోయిన కాంతార చాప్టర్ 1 కెమెరామెన్
on Oct 8, 2025

ప్రస్తుతం థియేటర్స్ లో 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)తన హవా కొనసాగిస్తు ఆరు రోజులకే 400 కోట్లరూపాయలు వసూలు చేసి పాన్ ఇండియా మేకర్స్ కి సరికొత్త సవాలు విసిరింది. మూవీలోని చాలా సన్నివేశాలు ప్రేక్షకులని విజువల్ గా ఎంతగానో మెస్మరైజ్ చేస్తున్నాయి. మెస్మరైజ్ చేయడమే కాదు, సదరు సన్నివేశాలని ఎలా చిత్రీకరించారని కూడా థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి ఆ సన్నివేశాలకి ఉన్న బలం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా 'చాప్టర్ 1 'కి ఛాయాగ్రాహకుడిగా పని చేసిన 'అరవింద్ కశ్యప్'(Arvind Kashyap)మూవీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతు తొంబై ఐదు శాతం మూవీ మొత్తాన్ని కర్ణాటకలోని కుంజాపురంలోనే తెరకెక్కించాం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతు రెండేళ్ల పాటు అక్కడే ఉన్నాం. కెమెరా లైటింగ్ విషయంలో ప్రయోగాలు చేసేవాడిని. దర్శకుడు అనుకున్న అవుట్ ఫుట్ వచ్చే వరకు అందరం కష్టపడేవాళ్ళం. అటవీ ప్రాంతంలో సరైన లైటింగ్ రావడానికి వారం రోజుల సమయం పట్టేది. పిల్లాడి చుట్టూ పులి తిరిగే సన్నివేశాలని మూవీ మొదలు పెట్టిన సంవత్సరంలోనే పూర్తి చేసాం.
పులిని విఎఫ్ఎక్స్ లో డిజైన్ చేశారనే ఫీలింగ్స్ ఆడియన్స్ కి రాకుండా ఉండటానికి, నిజమైన పులి వస్తే ఏఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలో తీసుకున్నాం. యువరాణి కనకవతి గుర్రంపై వచ్చే సీన్ కోసం చాలా కష్టపడ్డాం. లొకేషన్ అడవిలో చాలా దూరం. కుంజాపురం నుంచి గంటన్నర ప్రయాణం చేయాల్సి వచ్చేది. మరో అరగంట నడుచుకుంటు వెళ్లిన తర్వాత, నలభై ఐదు నిమిషాల పాటు ఒక కొండని ఎక్కి దిగాల్సి వచ్చేది. కేవలం మూడు నిమిషాల నిడివి గల సీన్ కి మూడు రోజులు షూటింగ్ చేసాం. ఇక వాతావరణం కూడా ఇబ్బంది పెట్టింది. ఒకసారి భారీ వర్షం కారణంగా మేము వేసిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో వారం పాటు అడవిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని అరవింద్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



