'కళాపురం' మూవీ రివ్యూ
on Aug 26, 2022

సినిమా పేరు: కళాపురం
తారాగణం: సత్యం రాజేశ్, సంచిత పూనాచ, కాషిమా రఫీ, ప్రవీణ్ యండమూరి, చిత్రం శ్రీను, జనార్దన్, సన, ఫైమా, కుమార్
మ్యూజిక్: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ జి.కె.
ఎడిటింగ్: ఎస్.బి. రాజు తలారి
సహ నిర్మాత: రజని తాళ్లూరి
రచన-దర్శకత్వం: కరుణ కుమార్
బ్యానర్స్: జీ స్టూడియోస్, ఆర్4 ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 26 ఆగస్ట్ 2022
ఇదివరకు 'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాలు రూపొందించి, ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందిన కథారచయిత కరుణ కుమార్ తీసిన మూడో చిత్రం 'కళాపురం'. సత్యం రాజేశ్‌ను హీరోగా చూపిస్తూ ఆయన రూపొందించిన ఈ సినిమా విడుదలకు ముందు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించలేదు. ఏమంత అంచనాలు లేకుండా మన ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే...
కథ
చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయిన కుమార్ (సత్యం రాజేశ్) అనే యువకుడు హైదరాబాద్‌లో ఉంటూ సినిమా దర్శకుడు కావాలని ప్రయత్నిస్తుంటాడు. అతనికి తోడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే ఇంకో ఫ్రెండ్ (ప్రవీణ్ యండమూరి) ఉంటాడు. నిర్మాతల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన వాళ్లతో సినిమా తీస్తానని అప్పారావు (జనార్దన్) అనే ఓ పెద్దాయన ముందుకు వచ్చి, అడ్వాన్స్ కూడా ఇస్తాడు. అయితే షూటింగ్‌ను తమ ఊరు కళాపురంలో జరపాలని అతను కండిషన్ పెడతాడు. కళాపురంకు వెళ్లిన కుమార్‌కు పోలీసుల వల్ల చిక్కులు ఎదురవుతాయి. అతని బ్యాగ్‌లో దొరికిన డబ్బులు స్వాధీనం చేసుకొని, ఆ ఏరియాలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయనీ, ఆ ఎన్నికలు అయ్యాక, ఆ డబ్బు ఎలా వచ్చిందో సరిగ్గా చెప్తే ఇచ్చేస్తామంటారు పోలీసులు. అప్పారావు కోసం ఫోన్ చేస్తే, అప్పటికే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి షాకవుతాడు కుమార్. ఆ తర్వాత ఏం జరిగింది? సినిమాని డైరెక్ట్ చేయాలన్న కుమార్ ఆశయం నెరవేరిందా? ఒకసారి ఇందు అనే అమ్మాయిని ప్రేమించి మోసపోయిన కుమార్, మరోసారి శారద (సంచిత పూనాచ) అనే అమ్మాయిని ఇష్టపడి తన ప్రేమను సఫలం చేసుకున్నాడా? అనే విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.
విశ్లేషణ
ఔత్సాహిక దర్శకులు, నటులకు సినిమా అవకాశాలు రావాలంటే ఎలాంటి తిప్పలు ఎదురవుతుంటాయనే విషయాన్ని వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు కరుణ కుమార్. ఈజీ మనీ కోసం కొంతమంది వ్యక్తులు అమాయకుల్ని ఎలా వాడుకుంటారో కూడా ఇందులో మనం చూస్తాం. కమెడియన్‌గా పలు సినిమాల్లో మనల్ని అలరించిన సత్యం రాజేశ్‌తో ఒక సీరియస్ క్యారెక్టర్‌ను చేయించడం సాహసమే అని చెప్పాలి. ఒక ఔత్సాహిక దర్శకుడు ఒక్క ఛాన్స్ కోసం నిర్మాతల చుట్టూ ఎలా తిరుగుతాడో, నిర్మాతలు ఎలాంటి కథలు కావాలంటారో ఈ సినిమాలో వాస్తవికంగా, అదే సమయంలో వినోదాత్మకంగా దర్శకుడు చూపించాడు.
ఈజీ మనీ సంపాదించడం కోసం కోయబాబా అవతారం ఎత్తిన జబర్దస్త్ అప్పారావు, ఛాన్స్ దొరికితే సపోటా పిక్కను నాగమణిగా నమ్మించి నైజీరియన్ల దగ్గర్నుంచి లక్షలు కొట్టేసే అప్పారావు (జనార్దన్)లను మనం ఈ సినిమాలో చూస్తాం. అదే అప్పారావు తను సినిమాని నిర్మిస్తానని కుమార్‌ను కళాపురంకు పంపిన తర్వాత వచ్చే సన్నివేశాలు, ఘటనలు మంచి వినోదాన్ని అందిస్తాయి. కుమార్‌తో లవ్ స్టోరీ నడిపిన ఇందు అనే యువతి సినిమాల్లో నటిగా ఛాన్స్‌ల కోసం ప్రయత్నిస్తూ, ఆ క్రమంలో ఎలా తన శరీరాన్ని ఓ సాధనంగా వాడుకుంటుందో చూసినప్పుడు ఆమె మీద మనకు కోపమేమీ రాదు. ఎందుకంటే సినిమా రంగంలో తారనవ్వాలని కలలు కనే అనేకమంది అమ్మాయిలకు ఆమె ఓ ప్రతినిధిగా కనిపిస్తుంది కాబట్టి. అలాగే సినిమా డైరెక్షన్ ఛాన్స్ కోసం చెప్పులరిగేలా తిరిగే వందలాది మంది ఔత్సాహిక దర్శకులు ఎలాంటి పెయిన్ అనుభవిస్తుంటారో కుమార్ పాత్ర మన కళ్లకు కడుతుంది. కళాపురంలో కుమార్ తీసిన సినిమాకు, తర్వాత ఓ పొలిటికల్ ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తాడు దర్శకుడు.
ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రి క్లైమాక్స్ ట్విస్ట్ తప్పితే 'కళాపురం' కథ చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. స్వతహాగా మంచి రచయిత అయిన కరుణ కుమార్ రచన ఈ సినిమాకు అతి పెద్ద బలం. అనేక సందర్భాల్లో డైలాగ్స్ నవ్విస్తాయి, వహ్వా అనిపిస్తాయి. జీవితంలో కుమార్ ఎదురుదెబ్బలు తిన్న సందర్భంలో వచ్చే సంభాషణలు చేయితిరిగిన రచయిత మాత్రమే రాయగలడనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే గొప్పగా ఉందని చెప్పలేం కానీ, సినిమా బోర్ కొట్టలేదంటే.. అది బాగున్నట్లేగా! ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఇంకో ఎస్సెట్. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయనది ఎంతటి పైచేయో మనకు తెలుసు. ఈ సినిమాకూ ఇంప్రెసివ్ స్కోర్‌ను ఆయన సమకూర్చాడు. ఆయన బాణీలు కూర్చగా, అనంతు చింతపల్లి రాసిన "ఓ బేబీ నా బేబీ" ఐటమ్ సాంగ్ రసికులను అలరిస్తుంది. ఇందు విషయం కుమార్‌కు తెలిసిపోయిన సందర్భంలో వచ్చే మాంటేజ్ సాంగ్ "నీలో ఉన్న ఆశలే" కూడా బాగుంది. ప్రసాద్ జి.కె. సినిమాటోగ్రఫీ, ఎస్.బి. రాజు తలారి ఎడిటింగ్‌కు వంకలు పెట్టాల్సిన పనిలేదు. తమ బాధ్యతలను సరిగ్గానే నిర్వహించారు.
నటీనటుల పనితీరు
కుమార్‌గా సత్యం రాజేశ్ కొత్తగా మన ముందు ఆవిష్కృతమయ్యాడు. ఆ క్యారెక్టర్‌లోని పెయిన్‌ను బాగా ప్రదర్శించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. నిజానికి ఆ క్యారెక్టర్‌ను ప్రేక్షకుల్లో ఇమేజ్ ఉన్న హీరో చేసినట్లయితే, సినిమాకు కమర్షియల్‌గా మరింత వర్కవుట్ అయివుండేది. హీరో ఫ్రెండ్‌గా, కుమార్ తీసే సినిమాలో హీరోగా నటించేవాడిగా ప్రవీణ్ యండమూరి చాలా ఈజ్‌తో నటించాడు. అప్పారావు పాత్రలో ఆడియెన్స్‌లో అంతగా పాపులర్ కాని జనార్దన్ చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని మంచి వేషాలు వస్తాయనిపిస్తుంది. ఇదివరకు ఆయన కరుణ కుమార్ ఫస్ట్ ఫిల్మ్ 'పలాస'లోనూ ఓ కీలక పాత్ర చేశాడు. శారదగా సంచిత పూనాచ, ఇందుగా కాషిమా రఫీ తమ పాత్రలకు న్యాయం చేశారు. కుమార్ తీసే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన ప్రేమ్‌సాగర్ పాత్రలో చిత్రం శ్రీను రాణించాడు. ఏ తరహా పాటనైనా ఇట్టే సునాయాసంగా రాసేసే రచయిత్రిగా జబర్దస్త్ ఫేమ్ ఫైమా కనిపించేది ఒకే సీన్‌లో అయినా అదరగొట్టేసింది. ముఖ్యమంత్రిగా సన, కోయబాబాగా జబర్దస్త్ అప్పారావు, ఇన్‌స్పెక్టర్‌గా ఫిల్మ్ జర్నలిస్ట్ కుమార్ కనిపించారు. డైరెక్టర్ కరుణ కుమార్ సైతం ఓపెనింగ్ సీన్‌లో నటించాడు.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్
హీరో పాత్రధారి తీసే సినిమా చుట్టూ నడిచే 'కళాపురం' వాణిజ్యపరంగా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలీదు కానీ, ప్రేక్షకులకు ఓ మంచి సినిమా చూశామనే ఫీల్‌ని అయితే కలిగిస్తుంది. వినోదంతో పాటు, ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రి క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాని ఆసక్తికరంగా మార్చాయి.
రేటింగ్: 3/5
- బుద్ధి యజ్ఞమూర్తి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



