కొరటాల శివకు న్యాయం కావాలి.. ట్విట్టర్‌లో అభిమానుల గోల!
on Jul 13, 2022

చిరంజీవి, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా, కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'ఆచార్య' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతింది. అదివరకు నాలుగు సినిమాలు తీసి, ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాలకు మొట్టమొదటి సారిగా డిజాస్టర్ ఎదురైంది. అలాగే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన ఈ మూడో సినిమా ఆయనకు అత్యంత చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న అన్ని ప్రాంతాల బయ్యర్లు నిలువునా మునిగిపోయారు.
కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త వివాదానికి కొరటాల శివ కేంద్రంగా మారాడు. ట్విట్టర్‌లో #JusticeForKoratalaSiva అనే హ్యాష్‌టాగ్ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ విషయంలో మహేశ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కటిగా కొరటాల శివకు న్యాయం చేయాలంటూ ఆ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తుంటే, దానికి వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
'ఆచార్య' మూవీతో కొరటాలను చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేశారని మహేశ్, తారక్ ఫ్యాన్స్ దుయ్యబడుతుండగా, ఆ సినిమా స్టోరీ, స్క్రీన్‌ప్లేపై దృష్టి పెట్టడానికకి బదులు ఆ సినిమా బిజినెస్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాడంటూ కొరటాలను విమర్శిస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో కొరటాల అభిమానులు #JusticeForKoratalaSiva అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
కొంతమంది బయ్యర్లు తమకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడంతో, వారికి న్యాయం చేకూరుస్తానని కొరటాల మాటిచ్చాడు. అయితే రాయలసీమ ప్రాంతానికి చెందిన కొంతమంది బయ్యర్లు, ఎగ్జిబిటర్లు మంగళవారం కొరటాల శివను కలిసి, డబ్బు ఇప్పించాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో రెండు రోజుల్లో విషయాన్ని సెటిల్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడని వినిపిస్తోంది. అయితే నిర్మాతల్లో ఒకరైన రామ్‌చరణ్ నుంచి ఇంతదాకా అతనికి సపోర్ట్ లభించలేదనేది టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



