'సీతారామం'లో బాలాజీ ఎవరో తెలుసా?
on Jul 13, 2022

యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ 'సీతారామం'. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు.
అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా బాలాజీ పాత్రను పరిచయం చేశారు. ఈ పాత్రలో ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటిస్తుండటం విశేషం. తరుణ్ భాస్కర్ ను బాలాజీగా పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో కూల్ డ్రింక్ తాగుతున్న ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.

బాలాజీ పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో కూడా ఆసక్తికరంగా వుంది. ''బాలాజీ హై నా.. సబ్ సంభాల్ లేగా(బాలాజీ వున్నాడు.. అంతా చూసుకుంటాడు) అని తరుణ్ భాస్కర్ చెప్పిన డైలాగ్ ఆయన పాత్రపై క్యూరియాసిటీని పెంచింది.
పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



