కంగనా రౌనత్, కేంద్ర ప్రభుత్వాలపై జయసుధ, జయప్రద సంచలన వ్యాఖ్యలు!
on Dec 26, 2022

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2' సెలబ్రిటీ షో క్రేజీగా సాగుతోంది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఈ షోకు ఆదరణ అమోఘంగా ఉంటోంది. తాజా ఎపిసోడ్లో జయప్రద, జయసుధ, రాశికన్నా అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాది నటులపై కొనసాగుతున్న వివక్షపై జయసుధ, జయప్రద ధ్వజమెత్తారు. "మీలాంటి సీనియర్లకు పద్మ అవార్డు ఇవ్వకుండా కంగనా రౌనత్ లాంటి హీరోయిన్లకు పద్మ ఇవ్వడం సమంజసమేనా?" అని ప్రశ్నించారు బాలకృష్ణ.
అంతే కాదు... బాలయ్య ఇంకా మాట్లాడుతూ జయసుధ, జయప్రదలను ఉద్దేశించి "మీ కెరీర్ లో ఎవరు చేయనటువంటి పాత్రలు చేశారు. మీరు చేసిన తర్వాత అలాంటి పాత్రలకు ఎవరూ కూడా అటెంప్ట్ చేయలేని అద్భుత పాత్రలు పోషించారు. సినిమాల్లో పెరిగారు... సినిమాల్లో జీవించారు. నిర్మాతలుగా సినిమాలు తీశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం అవార్డు రాలేదు. నిన్న కాక మొన్న వచ్చిన కంగనా రౌనత్‌కు పద్మ అవార్డు వచ్చింది. మీకు బాధ కలుగలేదా?" అని ప్రశ్నించాడు.
దీనికి జయసుధ సమాధానం ఇస్తూ... "నేను, జయప్రద మేము ఎన్నో ఏళ్ల కిందటే సినిమాలలోకి వచ్చి, కెరీర్ మొదట్లో కూడా చాలా విభిన్నపాత్రలు చేసుకుంటూ వెళ్ళాం. అయితే కంగనా రౌనత్ విషయానికి వస్తే ఆమె అమేజింగ్ యాక్టర్. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పది సినిమాలు చేసిన ఆమెకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి మాకు ఇవ్వకపోవడం బాధ కలిగించే అంశం. మాకు ఎంతో సీనియారిటీ ఉంది. మేము ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించాం. దక్షిణాదిలో ఉన్న నటీనటులకు కేంద్రం ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదు. నాకు పద్మశ్రీ అవార్డు రావడంలేదని నేను ఇలా ఫిర్యాదు చేస్తూ మాట్లాడడం లేదు. దక్షిణాదిలో శారద, సావిత్రి, విజయ నిర్మల వంటి వాళ్ళు ఎంతో గొప్పగా నటించారు. అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరింపజేశారు. దక్షిణాది నటులపై వివక్ష ఎందుకు అనేది అర్థం కావడం లేదు? విజయనిర్మల నటిగా, దర్శకురాలిగా ఎంతో రాణించారు. డైరెక్టర్గా ఆమె 48 సినిమాలకు దర్శకత్వం వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. అలాంటి ఆమెను గుర్తించకపోవడం చాలా దారుణం" అని అన్నారు.
జయప్రద మాట్లాడుతూ.. "పద్మశ్రీ అవార్డు రాకపోతే మాకు బాధగా ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే మేము అడిగి మరీ అవార్డులను తీసుకోవడం మాకు ఇష్టం లేదు. మా ప్రతిభను, సీనియార్టీని గుర్తించి, గౌరవించాలని భావిస్తున్నాం. అడిగి అవార్డులు తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు. నేను ఎంపీగా ఉన్న సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పలుమార్లు దరఖాస్తు చేశాను. కానీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోలేదు. అయినా నా ప్రయత్నాలను ఆపలేదు" అన్నారు.
ఇక బాలయ్య చాలా చిలిపిగా మాట్లాడుతూ, వారిని ఉద్దేశించి మీరు ఇద్దరు మంచి డాన్సర్లు. మీతో డాన్స్ చేయలేకపోయాను. ఇప్పుడు నాతో మీరిద్దరూ డాన్స్ చేస్తారా? అని అడుగగా జయసుధ, జయప్రదలు వచ్చి 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంలోని "ఇరువురు భామల కౌగిలిలో.." అనే పాటకు స్టెప్పులు వేసి ప్రేక్షకులను, అభిమానులను అలరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



