అప్పుడు మహేశ్ 'స్పైడర్'.. ఇప్పుడు విజయ్ 'వారిసు'! రిజల్ట్ ఏమిటో చూడాలి!!
on Dec 26, 2022

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'వారిసు'. ఈ చిత్రం ఇప్పటికే కోలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. వాస్తవానికి ఈ చిత్రానికి దర్శకనిర్మాతలు తెలుగు వారే కావడం విశేషం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఈ మూవీ 'వారసుడు' పేరుతో రిలీజ్ కానున్నది. విజయ్ నటించిన చిత్రాలు ఈమధ్యనే తెలుగులోకి డబ్ అవుతున్నాయి. ఇంతకు ముందు విజయ్ ఎక్కువగా తెలుగులో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాలను, మరీ ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన చిత్రాలను తమిళంలో రీమేక్ చేసి అందులో నటించేవాడు.
ఆమధ్య మహేష్‌బాబు కూడా తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ 'స్పైడర్' సినిమా చేశాడు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో డిజాస్టర్ అవ్వడంతో మహేష్ రెంటికి చెడ్డ రేవడి అయ్యాడు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దళపతి విజయ్‌ని తెలుగులో నిలబెట్టేందుకు ఈసారి తెలుగువారైన దిల్ రాజు, వంశీపైడిపల్లిలు పూనుకున్నారు. ఈ మూవీ కోసం దిల్ రాజు 250 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించాడు.
వాస్తవానికి రాజు, వంశీలకు తెలుగు మీద కంటే తమిళం మీదనే గురి ఉంది. తెలుగులో అటు ఇటు అయినా, విజయ్ కి కోలీవుడ్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ ఈజీగా భారీ వసూళ్లు వసూలు చేస్తుందని అంచనా. అయితే 'స్పైడర్' లాగా 'వారసుడు' కూడా రెంటికి చెడ్డ రేవడి అయితే మాత్రం దిల్ రాజుకి ఇబ్బందే. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం అందుకుంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.
కాగా చెన్నైలో ఈ 'వారిసు' మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. తమిళంలో పొంగల్ పోటీలో విజయ్ తో పాటు మరో స్టార్ హీరో అజిత్ తలపడుతుండటంతో ఈ సంక్రాంతి రేస్ చాలా ఆసక్తికరంగా మారింది.
ఇక తెలుగులో ఈ 'వారసుడు' మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 'వీరసింహారెడ్డి'లతో పోటీపడనుంది. అసలే ఈమధ్య దిల్ రాజు జడ్జిమెంట్ పెద్దగా పనిచేయడం లేదు. ఒకప్పటిలా వరుస విజయాలు లేవు. కాగా ఇంతకు ముందు ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తిలతో తీసిన 'ఊపిరి' తరహా ప్రయోగమే ఇది అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



