మా అమ్మాయిని అసభ్యకర పోస్టులతో ఇబ్బందిపెట్టారు!
on Dec 26, 2022

నటి, రాజకీయ నాయకురాలు రోజా 'చామంతి' చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించింది. ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం 'ప్రేమ తపస్సు'. అందులో ఆమె రాజేంద్రప్రసాద్ సరసన నటించింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ నటుడు, డైరెక్టర్ ఎన్.శివప్రసాద్ దర్శకత్వంలో ఆమె ఈ మూవీ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత శోభన్ బాబు నటించిన 'సర్పయాగం' చిత్రంలో ఆయన కూతురిగా నటించింది. ఇక ఆమెకు 'సీతారత్నం గారి అబ్బాయి' నుండి తిరుగే లేకుండా పోయింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఆమె తిరిగి చూసిందే లేదు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, వినోద్ కుమార్, జగపతిబాబు, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు ఇలా పలువురు హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. అంతేకాదు.. 'స్వర్ణక్క', 'సమ్మక్క సారక్క'... వంటి పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. చివరగా ఆమె జనార్దన మహర్షి దర్శకత్వంలో శ్రియా శరణ్ నటించిన 'పవిత్ర', జె.కె. భారవి దర్శకత్వంలో వహించిన 'శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య' వంటి చిత్రాలలో కనిపించింది. 2013 నుంచి ఆమె తెలుగు వెండితెరకు దూరంగా ఉంటుంది. కానీ తమిళంలో మాత్రం 2015 వరకు చిత్రాలు చేసింది. మలయాళంలో కూడా 2015లో ఒక చిత్రం చేసింది. ప్రస్తుతం నగరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఏపీ మంత్రిగా కొనసాగుతోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఈమె రాజకీయాల్లో మాత్రం ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను షేర్ చేసుకుంది. వాటి విషయానికి వస్తే.. రోజా సెల్వమణి రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్ కూడా తనకు చాలా ముఖ్యమని చెప్పింది. గతంలో అయితే ఎన్నోసార్లు తన పిల్లలకు కూడా వండి పెట్టేంత సమయం కూడా దొరకలేదని.. ఆనాటి పరిస్థితుల వలన ఫ్యామిలీ లైఫ్ కి సమయం కేటాయించలేక దూరమయ్యాను అని అన్నారు. అయితే కరోనా లాక్ డౌన్ టైం లో మాత్రం పిల్లలకు వండి పెట్టి వారిని ప్రేమగా చూసుకునే అదృష్టం లభించిందని రోజా చెప్పుకొచ్చింది. "నాకు ఎంతో పేరు తెచ్చిన జబర్దస్త్ షోతో నాకు చాలా ఎమోషనల్ బాండింగ్ ఉండేది. ఎప్పుడూ ఆ షో నుంచి బయటికి రావాలని అనుకోలేదు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఇప్పటికీ మంత్రినయ్యాను అంటే జబర్దస్త్ దానికి కారణం. జబర్దస్త్ షో సెంటిమెంట్ తో సమానం. ఆ షో నుంచి బయటకు రావడానికి ఎవరూ కారణం కాదు. నాకు ఇప్పుడు వీలు కుదరడం లేదు. అందువలన చేయడం లేదు." అని వెల్లడించింది.
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి మాట్లాడుతూ, "వాటిని అసలు పట్టించుకోవద్దు. ఆఖరికి నా పిల్లలు కూడా అలా ట్రోల్ చేసే వారి వలన ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మా అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేసేవారు. దాని వలన మా అమ్మాయి చాలా రోజులు బాధపడింది. ఆ విషయం నాతో కూడా చెప్పలేదు. తను చాలా సెన్సిటివ్. మళ్లీ ఆ విషయంపై వివాదం ఎందుకు అని తను మౌనంగా ఉండిపోయింది. నెగటివ్ కామెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత మా అమ్మాయి నాతో ఒక మాట చెప్పింది. అమ్మ మనకు ఇవి అవసరమా? అని బాధపడింది. వారిది ఏమీ అర్థం చేసుకోలేని వయసు. ఆ వయసులో ఇలా ఇబ్బంది పెడుతూ ఉండడం సరికాదు. ఇక వారికి పరిస్థితి గురించి నేను అర్థమయ్యేలా చెప్పేదాన్ని. నేను మాత్రం ఎవర్ని ఎప్పుడు కూడా పర్సనల్‌గా కామెంట్ చేసిన సందర్భం లేదు. నేను వర్క్ చేసిన స్టార్స్ అందరూ కూడా నన్ను ఎప్పుడు కలిసినా కూడా ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడుతారు. ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టి పంపించడం నా అలవాటు" అని రోజా చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



