బెనిఫిట్ షోలపై ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం
on Sep 12, 2016

స్టార్ హీరో సినిమా వస్తోందంటే ఆ హంగామానే వేరు. రిలీజ్‌కి వారం రోజుల ముందు నుంచీ సందడి మొదలైపోతుంది. ఇక బెనిఫిట్ షోల గురించి చెప్పనవసరం లేదు. అర్థరాత్రి ఆట పడితే... అక్కడంతా ఫ్యాన్స్ హంగామానే! టికెట్లు రూ.2 వేలు పెట్టి కొని మరీ సినిమా చూసేస్తారు. ఈ షోల వల్ల.. నిర్వాహకులకు ఊహించని రీతిలో లాభాలు అందుతున్నాయి. కానీ... బెనిఫిట్ షోల వల్ల... సినిమాకే ఇబ్బంది కలుగుతోందని, బెనిఫిట్ షోల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని చిత్రసీమ అభిప్రాయ పడుతోంది. బెనిఫిట్ షోల వల్ల తెల్లారేసరికి టాక్ బయటకు వచ్చేస్తోంది. ఆరింటికే రివ్యూలు పడిపోతున్నాయి. సినిమా హిట్టా, ఫట్టా అనేది తెలిసిపోతోంది. దాంతో తొలిరోజు వసూళ్లపై విపరీతమైన ప్రభావం పడుతోంది. సినిమా బాగుందని చెప్తే ఫర్వాలేదు. ఫ్లాప్ అంటే రావల్సిన ఆ కొన్ని వసూళ్లూ రావడం లేదు.
ఈమధ్య బెనిఫిట్ షోలు వేసిన ప్రతీ సినిమాకీ నెగిటీవ్ టాకే వచ్చింది. తాజాగా జనతా గ్యారేజ్ కూడా ఫ్లాపే అన్నారు. బెనిఫిట్ షో రిపోర్ట్‌కీ వసూళ్లకూ అస్సలు సంబంధమే లేదు. బెనిఫిట్ షో.. టాకే నిజమైతే సినిమా ఈపాటికి మునిగిపోవాల్సిందే. కానీ అలా జరగలేదు. అదృష్టవశాత్తూ సినిమా నిలబడింది. వసూళ్లు భారీగా అందుతున్నాయి. బెనిఫిట్ షోల వల్ల జరిగే నష్టాన్ని చిత్రసీమ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ విషయంలో కలవర పడుతున్నాడట. కనీసం తన సినిమాలకు బెనిఫిట్ షోలు పడకుండా ఆపాలని చూస్తున్నాడట. బెనిఫిట్ షోల వల్ల టాక్ బయటకు వచ్చేసి త్వరగా పొక్కేస్తోందని, దాని వల్ల కొత్త టెన్షన్‌లు వస్తున్నాయని, రివ్యూలు కూడా సరిగా ఉండడం లేదని వాపోతున్నాడు ఎన్టీఆర్. అదే జనతాకి మంచి రివ్యూలు పడి ఉంటే. ఈ సినిమా ఇంకో స్థాయిలో ఉండేదని అభిప్రాయ పడుతున్నాడట. ఇక మీదట ఎన్టీఆర్ సినిమాలకు బెనిఫిట్ షోలు ఉండవన్న విషయం మాత్రం స్పష్టమైంది. మిగిలిన హీరోలెలాంటి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



