కాజల్ కెరీర్ ముగిసినట్లేనా?
on Jul 12, 2022

చందమామగా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన కాజల్ అగర్వాల్ కెరీర్ ఇక ముగిసిపోయినట్లేనా? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొంత కాలం క్రితం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడి, ఇటీవల ఓ అబ్బాయికి తల్లి కూడా అయిన కాజల్.. మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఈ మధ్యలో ఆమె చిరంజీవి జోడీగా 'ఆచార్య' మూవీలో నటించింది. అయితే డైరెక్టర్ కొరటాల శివ ఆమె పాత్రను తొలగించి, సినిమాని విడుదల చేశాడు. కథకు ఆమె పాత్ర అడ్డు వస్తుందనే ఉద్దేశంతోటే ఆ నిర్ణయం తీసుకున్నామని, విడుదలకు ముందు చెప్పారు. ఏదేమైనా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.
'ఆచార్య' మూవీకి పనిచేసే టైమ్‌లోనే నాగార్జున మూవీ 'ది ఘోస్ట్'లో నటించడానికి అంగీకరించింది కాజల్. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో, ఆమెను తొలగించి, బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్‌ను తీసుకున్నారు. వీటి విషయం ఇలా ఉంటే, కమల్ హాసన్ 'ఇండియన్ 2' నుంచి కూడా ఆమెను తీసేసి, మరో హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. కొంత కాలంగా 'ఇండియన్ 2' షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. 50 శాతం పూర్తయిన ఆ సినిమాలో కాజల్‌పై కొన్ని సీన్లు తీశాడు డైరెక్టర్. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో చేస్తున్న మూవీని పూర్తిచేశాక, శంకర్ 'ఇండియన్ 2' షూటింగ్‌ను కంటిన్యూ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్ ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు కూడా గట్టిగా వినిపిస్తోంది.
వీటన్నింటి బట్టి చూస్తుంటే.. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ కెరీర్ ముగిసినట్లే అని చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ నటించాలనుకున్నా మునుపటి డిమాండ్ ఆమెకు ఉండదనీ అంటున్నారు. కాజల్ ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం ఆమె కొడుకు నీల్‌తో కాలం గడుపుతోందనీ, త్వరలోనే ఆమె తిరిగి తెరపై హీరోయిన్‌గానే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందనీ నమ్ముతున్నారు. చూద్దాం.. కాజల్ ఏం చేస్తుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



