ఏపీకి సినిమా ఇండస్ట్రీ తరలిపోతుందా? జగన్ పట్టుదల నెరవేరుతుందా?
on Feb 12, 2022

రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే సినిమా కలెక్షన్లలో తెలంగాణ వాటా 35 నుంచి 40 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్ వాటా 60 నుంచి 65 శాతం ఉంటుంది. అయితే ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఇండస్ట్రీ హైదరాబాద్‌లోనే కొనసాగుతూ వస్తోంది. కారణం.. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు ఇండస్ట్రీ తరలివచ్చాక పరిశ్రమ ప్రముఖులంతా హైదరాబాద్‌లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. స్టూడియోల ఏర్పాటుతో పాటు మౌలిక వసతులన్నీ హైదరాబాద్‌లో ఉండటం, కృష్ణానగర్ పరిసర ప్రాంతాలు చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులకు అడ్డాగా మారడంతో ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక కూడా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది.
2014లో రెండు రాష్ట్రాలుగా తెలుగునాడు విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌కు తెలుగు చిత్రసీమ తరలి వెళ్తుందని ఎవరూ ఆశలు పెట్టుకోలేదు. సమశీతోష్ణ పరిస్థితులు ఉండటం, మౌలిక వసతుల రీత్యా, కాస్ట్ ఆఫ్ లివింగ్ రీత్యా హైదరాబాద్ బెస్ట్ ఆప్షన్ అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తూ వస్తున్నాయి. విశాఖపట్నం అందమైన నగరం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చక్కని ప్రకృతి సంపద ఆ ప్రాంతం సొంతం. ఒకవైపు ఎటు తిరిగీ సముద్రం ఉన్నదాయె. అయితే వేసవి కాలం అక్కడ విపరీతమైన ఉక్కపోత ఉంటుందనేది కాదనలేని నిజం. ఆ టైమ్‌లో అక్కడ ఔట్‌డోర్ షూటింగ్‌లు నిర్వహించడం కష్టం అనే భావన నెలకొంది. అయినప్పటికీ ఇదివరకే డి. రామానాయుడు అక్కడ సువిశాల ప్రాంతంలో రామానాయుడు స్టూడియోస్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ తరచుగా కాకపోయినా ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగానే షూటింగ్‌లు జరుగుతున్నాయి.
ఇప్పుడు ఎలాగైనా ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగు చలనచిత్ర పరిశ్రమను తరలించాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అందుకే సినిమా టికెట్ ధరల వ్యవహారం, సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మడం లాంటి అంశాలతో ఒక్కసారిగా తెలుగు చిత్రసీమ తనవైపు దృష్టి సారించేలా చేయగలిగారు. తద్వారా ఇండస్ట్రీ ప్రముఖులైన చిరంజీవి, మహేశ్, ప్రభాస్, రాజమౌళి లాంటివాళ్లను తన దగ్గరకు రప్పించుకోగలిగారు. వాళ్లంతా ఇప్పుడు జగన్ భజన చేస్తుండటం చూస్తున్నాం. చిరంజీవి లాంటి మెగాస్టార్ రెండు చేతులూ జోడించి, ఇండస్ట్రీని ఆదుకోవాలని అర్థించడం చూసి అందరూ విస్తుపోతున్నారు. అంటే ఇండస్ట్రీపై జగన్ ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నారనే దానికి చిరు ఉదంతం ఒక నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో స్టూడియోలు నిర్మించడానికి, ఇండస్ట్రీ వ్యక్తులకు స్థలాలు కేటాయించడానికి అనువైన భూములను గుర్తించాలని సంబంధిత మంత్రులకు, ఆయా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయంటున్నారు. సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్తే ఆ గ్లామర్ వేరే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తనను సినిమావాళ్లు ఉపేక్షిస్తూ వస్తున్నారనీ, పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయంతో ఉన్న జగన్.. వాళ్లను తన దగ్గరకు రప్పించుకోవడంలో ఇప్పటికే సక్సెస్ అయ్యారు. రానున్న రోజుల్లో వారంతా తనను గౌరవించే విధంగా పరిస్థితులను కల్పిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి మొత్తంగా చిత్రపరిశ్రమ తరలి వెళ్తుందనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. కొన్ని రోజులు హైదరాబాద్‌లో, కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉండే విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తులు తమ షెడ్యూల్‌ను మార్చుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం, ఏం జరుగుతుందో...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



