'పొన్నియన్ సెల్వన్ 1' ట్రైలర్ వెల్లడిస్తోన్న ఆసక్తికర విషయాలు!
on Sep 7, 2022

మణిరత్నం సినిమా 'పొన్నియన్ సెల్వన్ 1' ట్రైలర్ వచ్చేసింది. చోళ మహాసామ్రాజ్య గాథతో కల్కి కృష్ణమూర్తి రచించిన తమిళ నవల 'పొన్నియన్ సెల్వన్' ఆధారంగా మణిరత్నం తీస్తున్న రెండు భాగాల సినిమాలో ఇది మొదటి భాగం. విక్రమ్, జయంరవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించారు. 3 నిమిషాల 20 సెకన్ల నిడివితో ఉన్న పీఎస్1 ట్రైలర్ సినిమాపై అంచనాలను గొప్పగా పెంచేసింది.
"వెయ్యి సంవత్సరాల క్రితం చోళనాట స్వర్ణశకం ఉదయించక మునుపు ఒక తోకచుక్క ఆకాశంలో ఆవిర్భవించింది. చోళరాజ కులంలోని ఒకరిని ఆ తోకచుక్క బలి కోరుతుందంటున్నారు జ్యోతిష్కులు" అంటూ వాయిస్ వినిపిస్తుండగా ట్రైలర్ మొదలైంది. సినిమా ఎంత గ్రాండియర్‌గా రూపొందిందో ఆ ట్రైలర్ తెలియజేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ హిస్టారికల్ మూవీని మణిరత్నం తీశారనడానికి ఈ ట్రైలర్ నిదర్శనం.
విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత, ప్రకాశ్‌రాజ్, ప్రభు, శరత్‌కుమార్, రెహమాన్, పార్తీబన్ లాంటి మహామహులు పోషించిన పాత్రలను ఇందులో పరిచయం చేశారు. "మా తండ్రి చోళరాజ్య రక్షణకై కత్తిపట్టమని ఆజ్ఞాపించారు. నేను చోళరాజ్య రక్షకుడ్ని. చోళ ప్రజల సేవకుడ్ని" అంటూ పొన్నియన్ సెల్వన్ (అరుణ్‌మోళి వర్మ) తనను తను పరిచయం చేసుకున్నాడు. ఆ రోల్‌ను జయం రవి పోషించాడు. సినిమాలో విక్రమ్, త్రిష, జయం రవి తోబుట్టువులుగా కనిపించనున్నారు.
సముద్రంపై తీసిన సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు, పాత్రధారుల కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లాంటివి ఈ సినిమాని ఎంతో రిచ్‌గా మార్చేశాయి. ఇలాంటి సినిమాలకు తనే ఎందుకు అవసరమో మరోసారి ఎ.ఆర్. రెహమాన్ తన మ్యూజిక్‌తో నిరూపించినట్లుగా ఉంది బ్యాగ్రౌండ్ స్కోర్ చూస్తుంటే. రవివర్మన్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ వేరే లెవల్ అన్నట్లుగా ఉంది. ఈ మూవీలోని పోరాటాలు, యుద్ధ సన్నివేశాల్ని కెచ్చా, శ్యామ్ కౌశల్ డిజైన్ చేశారు.
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై మణిరత్నం, సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మించారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా 'పీఎస్1' అత్యధిక థియేటర్లలో రిలీజవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



