కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో సరికొత్త విషయాలు
on Jul 9, 2022

కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా 'విక్రమ్' బ్లాక్‌బస్టర్ కావడమే కాకుండా తమిళంలో మునుపటి సినిమాల బాక్సాఫీస్ రికార్డులను తుడిచిపెట్టి నిర్మాతలకు భారీ లాభాలను సమకూర్చి పెట్టింది. 'విక్రమ్' హిట్టవడంతో 'ఇండియన్ '2 ప్రొడక్షన్ కంపెనీ లైకా ప్రొడక్షన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతోంది. కొంత కాలం క్రితం 'ఇండియన్ 2' షూటింగ్ నిలిచిపోయింది. అది ఓవర్ బడ్జెట్ అవుతోందని లైకా ప్రొడక్షన్స్ ఫీలవడమే దీనికి కారణం. రూ. 250 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలైన ఆ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకొనే నాటికే రూ. 180 కోట్లు ఖర్చయిపోయాయి.
దాంతో బడ్జెట్‌ను అదుపులో పెట్టాల్సిందిగా డైరెక్టర్ శంకర్‌ను కోరాడు నిర్మాత సుబాస్కరన్. ఇందుకు శంకర్ నిరాకరించడంతో నిర్మాతలు ఆ ప్రాజెక్టును నిలిపేశారు. మరోవైపు శంకర్ కూడా రామ్‌చరణ్ సినిమాని మొదలు పెట్టేశాడు. 'విక్రమ్' మూవీ రిజల్ట్‌తో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల దాకా వసూలు చేయడంతో, 'ఇండియన్ 2'ను తిరిగి పట్టాలెక్కించాలని కమల్ హాసన్ భావిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో శంకర్ కూడా రామ్‌చరణ్ మూవీని పూర్తిచేశాక, 'ఇండియన్ 2' షూటింగ్‌ను రిస్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
అయితే ఆ సినిమా తారాగణం విషయంలో మార్పులు జరగనున్నాయి. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు.. కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్ ఉండగా, ఇప్పుడు కాజల్ ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాజల్ పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకు తల్లయిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రధారులైన వివేక్, నెడిముడి వేణు మృతి చెందారు. వారి స్థానాల్లో ఇప్పుడు వేరే నటులు రానున్నారు.
శంకర్ డైరెక్షన్‌లో తండ్రీకొడుకులుగా కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేసిన 'ఇండియన్' (భారతీయుడు) ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. లంచగొండితనం అంటే అసహ్యించుకొనే స్వాతంత్ర్య సమరయోధుడైన తండ్రి, తన కొడుకే పెద్ద లంచగొండి అని తెలిసి, అతడిని చంపడానికి వెనుకాడని కథను జనం బాగా ఆదరించారు. మొదటి సినిమా తరహాలోనే 'ఇండియన్ 2'లోనూ కమల్ లుక్ ఉండనుంది. కాకపోతే ఇందులోని పాయింట్ భిన్నంగా ఉంటుందని సమాచారం.
మ్యూజిక్‌కు, యాక్షన్ సీక్వెన్స్‌కు ఈ మూవీలో చాలా ప్రాధాన్యం ఉండనుంది. అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ రెడీ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లను పీటర్ హెయిన్ డిజైన్ చేయనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



