'కుందవాయి'పై ఆశలు పెట్టుకున్న త్రిష
on Jul 9, 2022

త్రిష నాయికగా పరిచయమై రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. ఇన్నేళ్లపాటు హీరోయిన్‌గా కొనసాగడమంటే మామూలు విషయం కాదు. అందచందాలతో పాటు ప్రతిభ కూడా ఉండటం, ఫిజిక్‌ను కరెక్టుగా మెయిన్‌టైన్ చేయడం వల్లే ఇంత కాలంగా ఆమె రాణిస్తూ వచ్చింది. 'వర్షం'తో తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తారగా మారిన త్రిష.. ఆ తర్వాత.. నువ్వొస్తానంటే నొనొద్దంటానా, అతడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, కింగ్, నమో వెంకటేశ.. లాంటి చిత్రాలతో అలరించింది.
ఆరేళ్ల క్రితం వచ్చిన ద్విభాషా చిత్రం 'నాయకి' తర్వాత ఆమె మళ్లీ ఇంతదాకా మరో తెలుగు సినిమా చెయ్యలేదు. అయితే తమిళ చిత్రాలు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ చిత్రాలు, ఒక మలయాళం చిత్రం ఉన్నాయి. తెలుగులో మూడు సినిమాలకు, తమిళంలో ఓ సినిమాకు బెస్ట్ ఫిల్మ్‌ఫేర్ యాక్ట్రెస్‌గా అవార్డులు అందుకున్న త్రిష.. త్వరలో ఓ ఎపిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ మూవీ.. మణిర్నతం డైరెక్ట్ చేస్తోన్న 'పొన్నియిన్ సెల్వన్'.
రెండు భాగాలుగా తయారవుతున్న ఈ సినిమాలో ఆమె యువరాణి కుందవాయి పాత్రను చేస్తోంది. మూవీలో ఆమె విక్రమ్, జయం రవి సోదరిగా, వల్లవారయన్ పాత్రధారి కార్తీకి జోడీగా కనిపించనుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. ప్రిన్సెస్ లుక్‌లో త్రిష సౌందర్యరాశిగా మెరిసిపోతోందని ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ, ఆమె లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అవార్డుల కంటే ప్రేక్షకాభిమానమే తనకు ముఖ్యమని చెప్పే త్రిష, 'పొన్నియిన్ సెల్వన్'లో చేస్తున్న కుందవాయి క్యారెక్టర్ తనకు మంచి పేరు తేవడంతో పాటు, మరింతగా ప్రేక్షకాదరణ సాధించి పెడుతుందని గట్టిగా నమ్ముతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



