బాబూ దేవరకొండ... అలా అంటే ఎలా?
on Feb 10, 2020

"నేనేం చేసినా సిక్స్ కొట్టాలనే దిగుతా. నాకు సింగిల్స్, డబుల్స్ తీసే ఓపిక లేదు" అని 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ భారీ డైలాగ్ కొట్టారు. ఆయన దృష్టిలో సిక్సులు అంటే బ్లాక్ బస్టర్ సినిమాలు. సింగిల్స్, డబుల్స్ అంటే ప్లాప్ సినిమాలు. ఆ డైలాగ్ కి అర్థం ఏంటంటే... ప్లాప్ సినిమాలు చేసే ఓపిక లేదని!
సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫార్ములా అంటూ ఏదీ లేదు. ఎవరూ కనిపెట్టలేదు. జయాపజయాలు ఎవరి చేతిలో లేవు. ప్రతిఒక్కరూ హిట్ సినిమా చేయాలని కష్టపడతారు. కొన్నిసార్లు కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. కొన్నిసార్లు రాదు. ఓపిగ్గా మంచి కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేయాలి. ఈ లాజిక్ విజయ్ దేవరకొండ ఎలా మిస్ అయ్యాడో? సింగిల్స్, డబుల్స్ తీసే ఓపిక లేదంటే ఎలా?
"'అర్జున్ రెడ్డి' తర్వాత 'గీత గోవిందం' చేశా. తమిళ్ రాకున్నా నేర్చుకుని 'నోటా' చేశా. తర్వాత 'డియర్ కామ్రేడ్' చేశా. అందులో కొన్ని స్టేడియం అవతల పడ్డాయి. కొన్ని స్టేడియం లోపల పడ్డాయి" అని విజయ్ దేవరకొండ అన్నాడు.
'గీత గోవిందం' తర్వాత విడుదలైన 'టాక్సీవాలా'ను మర్చిపోయినట్టున్నారు. ఆ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చింది. పెట్టిన పెట్టుబడికి ఎక్కువ డబ్బులు తెచ్చింది. కానీ, హిట్టు బ్లాకు బస్టర్ కాదు. 'నోటా' అయితే సింగిల్ స్కోర్ చేసింది. 'డియర్ కామ్రేడ్' డబుల్ తీసింది అనుకోవచ్చు. 'అర్జున్ రెడ్డి' తర్వాత 'గీత గోవిందం' ఒక్కటే స్టేడియం బయటపడింది. ఆ క్రెడిట్ కూడా విజయ్ దేవరకొండ ఒక్కడిది కాదు. ఆ సినిమా విజయంలో దర్శకత్వం, నిర్మాతల ప్లానింగ్, పాటలు కీలక భూమిక పోషించాయి. అందుకని, ఈ నెల 14న విడుదలవుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్'తో ఎలాగైనా సిక్సర్ కొట్టాలని విజయ్ దేవరకొండ తన మాటలతో సినిమాకి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



