అజిత్‌ను డైరెక్ట్ చేయబోతున్న 'రూలర్' డైరెక్టర్
on Feb 9, 2020

తమిళ్ సూపర్ స్టార్స్‌లో ఒకడైన అజిత్ కుమార్ వరుస హిట్లతో జోరు మీదున్నాడు. 'వేదాళం', 'వివేగం', 'విశ్వాసం', 'నేర్కొండ పార్వై' సినిమాలు ఆయన అభిమానుల్ని అలరించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షాన్ని కురిపించాయి. వీటిలో చివరి చిత్రం హిందీ హిట్ 'పింక్'కు రీమేక్ అనే విషయం తెలిసిందే. ఆ సినిమాని తీసిన డైరెక్టర్ హెచ్. వినోద్ డైరెక్షన్‌లోనే ఆయన తాజాగా 'వాలిమై' సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ఆయన సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ విషయాన్ని రవికుమార్ స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు.
"మీ అందరి ప్రేమాభిమానాలతో నా తర్వాతి సినిమాను అజిత్ కుమార్ గారితో చెయ్యబోతున్నా. మనకున్న బెస్ట్ ఆర్టిస్టుల్లో ఒకరిని పదిహేడేళ్ల తర్వాత డైరెక్ట్ చేస్తున్నా. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ అవుతుంది" అని ఆయన ట్వీట్ చేశారు. ఇదివరకు అజిత్‌తో రవికుమార్ 'విలన్' (2002), 'వరలారు' (2006) సినిమాల్ని రూపొందించారు. 2014లో రజనీకాంత్‌తో తీసిన డిజాస్టర్ మూవీ 'లింగా' తర్వాత ఆయన తమిళంలో తీయబోతున్న సినిమా ఇదే. ఇటీవల ఆయన తెలుగులో బాలకృష్ణతో 'జై సింహా', 'రూలర్' సినిమాలు తీశారు. వాటిలో 'రూలర్' కూడా డిజాస్టర్ అయ్యింది. ఏ నేపథ్యంలో ఆయనకు అజిత్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం ఆశ్చర్యకరమే. ఈ సినిమాతోనైనా ఆయన హిట్ కొడతాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



