ENGLISH | TELUGU  

'హంట్' మూవీ రివ్యూ

on Jan 26, 2023

సినిమా పేరు: హంట్
తారాగణం: సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్, మైమ్ గోపి, కబీర్ సింగ్
సినిమాటోగ్రఫీ: అరుల్‌ విన్సెంట్‌
సంగీతం: జిబ్రాన్‌
ఎడిటర్: ప్రవీణ్ పూడి
దర్శకత్వం: మహేష్
నిర్మాత: వి.ఆనంద ప్రసాద్‌
బ్యానర్: భ‌వ్య క్రియేష‌న్స్
విడుదల తేదీ: జనవరి 26, 2023

జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు 'హంట్' అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీకాంత్, భరత్ ముఖ్య పాత్రలు పోషించడం.. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై సినీ ప్రియుల్లో బాగానే ఆసక్తి నెలకొంది. రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? సుధీర్ బాబుకి విజయాన్ని అందించేలా ఉందా?

కథ:
ఐపీఎస్ అధికారులు అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు), మోహన్(శ్రీకాంత్), ఆర్యన్ దేవ్(భరత్) ముగ్గురూ మంచి స్నేహితులు. మోహన్ పైఅధికారి అయినప్పటికీ ఆ ఇద్దరితో ఎంతో సన్నిహితంగా ఉంటాడు. అయితే గవర్నర్ చేతుల మీదుగా ఆర్యన్ దేవ్ గ్యాలంటరీ అవార్డు అందుకుంటుండగా అతడ్ని ఎవరో షూట్ చేసి చంపేస్తారు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన అర్జున్ ప్రసాద్ హంతకుడుని కనిపెడతాడు. కానీ ఆ విషయాన్ని కారులో వెళ్తూ మోహన్ కి ఫోన్ లో చెప్తుండగా యాక్సిడెంట్ అయ్యి.. గతం మర్చిపోతాడు. అర్జున్ గతం మర్చిపోయిన విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా.. అతనే ఈ కేసుని విచారించేలా మోహన్ సాయం చేస్తాడు. గతంలో ఏం జరిగిందో అంతా వివరించి వెనకుండి నడిపిస్తూ ఉంటాడు. అలా ఓ వైపు తన గురించి తాను తెలుసుకుంటూనే, మరోవైపు తాను మర్చిపోయిన ఆ హంతకుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు అర్జున్. ఈ క్రమంలో ఆ కేసులో ముగ్గురు అనుమానితులు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకరు రాయ్, రెండు కల్నల్ ప్రవీణ్ సింగ్, మూడు టెర్రరిస్ట్ గ్రూప్. అసలు ఆ ముగ్గురితో ఆర్యన్ దేవ్ కి ఉన్న సంబంధం ఏంటి?.. నిజంగానే ఆ హత్య వారిలో ఎవరైనా చేశారా లేక దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా?.. అసలు ఆ హంతకుడు ఎవరు? ఆర్యన్ ని ఎందుకు చంపాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ:
మూవీ టీమ్ ఎక్కడా అధికారికంగా చెప్పినట్లు లేదు గానీ ఇది 2013లో వచ్చిన మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'ముంబై పోలీస్'కి రీమేక్. పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో సుధీర్ బాబు నటిస్తే.. రెహమాన్ పోషించిన పాత్రలో శ్రీకాంత్, జయసూర్య పోషించిన పాత్రలో భరత్ కనిపించారు. కథాకథనాలు మాత్రమే కాదు.. సన్నివేశాలు కూడా ఒకటి అరా తప్ప దాదాపు 'ముంబై పోలీస్'లోనివే 'హంట్'లో దర్శనమిస్తాయి. ప్రపంచసినిమా అరచేతిలోకి వచ్చేసిన ఈ ఓటీటీ యుగంలో పదేళ్ల క్రితం వచ్చిన సినిమాని మక్కీకి మక్కీ దించడం సాహసమనే చెప్పాలి. ఓవైపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలరించడానికి ప్రయత్నిస్తుంటే.. ఈ పదేళ్ల క్రితం నాటి మలయాళ ఫిల్మ్ రీమేక్ ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం అనుమానమే. మరి ఈ రీమేక్ ఆలోచన దర్శకుడిదో, నిర్మాతదో, హీరోదో లేక అందరిదో తెలీదు గానీ ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేది.

ఇక సినిమా విషయానికొస్తే.. మొదలవ్వడమే నేరుగా కథలోకి వెళ్ళిపోయింది. హంతకుడు ఎవరో తెలుసుకున్న హీరో కాసేపటికే యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోవడంతో ఆసక్తికరంగా ప్రారంభమైంది. ఓ వైపు హీరో తన గురించి తాను తెలుసుకుంటూ.. మరోవైపు తన ఫ్రెండ్ ని చంపిన హంతకుడిని కనిపెట్టాలి. అంటే ఆల్రెడీ ఛేదించిన కేసునే మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాలి. బలమైన పాయింట్, స్క్రీన్ ప్లే ఉన్నాయి కాబట్టే 'ముంబై పోలీస్' అంతలా ఆకట్టుకుంది. అయితే హంట్ లో ఆ చిత్రాన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశారే తప్ప.. ఇక్కడికి తగ్గట్లుగా ఆసక్తికరమైన మార్పులు చేయడం, స్క్రీన్ ప్లేని మరింత గ్రిప్పింగ్ గా మలచడంలో ఫెయిల్ అయ్యారు. చేసిన ఒకటి అరా మార్పులు కూడా అతికించినట్లుగా ఉన్నాయి. అర్జున్ ప్రసాద్ యారోగెంట్ అని.. అతను, ఆర్యన్ బెస్ట్ ఫ్రెండ్స్ అని డైలాగ్స్ రూపంలో తెలుస్తుంది గానీ అందుకు తగ్గట్లుగా వాటిని ఎస్టాబ్లిష్ చేసేలా బలమైన సన్నివేశాలు పడలేదు. ముఖ్యంగా వారి మధ్య స్నేహం చిగురించే సన్నివేశాలు మరింత అందంగా, బలంగా ఉండేలా రాసుకుంటే బాగుండేది. 

ముఖ్యంగా ఇది క్లైమాక్స్ ట్విస్ట్ మీద ఆధారపడి రూపొందిన సినిమా. అప్పటివరకు కథనాన్ని ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించగలగాలి. ఆ విషయంలో దర్శకుడు మహేష్ కొంతవరకే విజయం సాధించాడు. చాలా చోట్ల బోర్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ తేలిపోయినట్లుగా ఉంది. ఇక ఊహకందని క్లైమాక్స్ సెకండాఫ్ కి బలమని చెప్పొచ్చు. 'ముంబై పోలీస్' చూడని వారికి మాత్రం ఈ సినిమా క్లైమాక్స్ బిగ్ సర్ ప్రైజ్ లా ఉంటుంది. దానిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు గానీ.. దాదాపు ఏ తెలుగు హీరో చేయని సాహసం ఈ సినిమాలో సుధీర్ బాబు చేశాడు. ఆ విషయంలో ఆయనను అభినందించాల్సిందే.

జిబ్రాన్‌ స్వరపరిచిన 'పాపతో పైలం' పాట ఏమంత ఆకట్టుకోలేదు గానీ నేపథ్యం సంగీతంతో మాత్రం మెప్పించాడు. అరుల్‌ విన్సెంట్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. రేనాడ్‌ ఫవెరో, బ్రయయాన్‌ విజియర్‌ ఫైట్లు ప్రమోషన్స్ లో మూవీ టీమ్ చెప్పినట్లుగా హాలీవుడ్ రేంజ్ లో అయితే లేవు గానీ పర్లేదు బాగానే ఉన్నాయి. ఎడిటర్ ప్రవీణ్ పూడి ఎడిటింగ్ నీట్ గా ఉంది. అయితే కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఉన్న ల్యాగ్ ని గమనించి ట్రిమ్ చేస్తే బాగుండేది. హీరో బాడీ బిల్డప్ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాల నిడివి తగ్గించవచ్చు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:
ఏసీపీ అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు చక్కగా ఒదిగిపోయాడు. గతం మర్చిపోయి, తన స్నేహితుడిని చంపిన హంతకుడిని పట్టుకునే పోలీస్ రోల్ లో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సర్ ప్రైజ్ చేశాడు. ఒక బ్రదర్ లా హీరో వెన్నంటే ఉంటూ, హంతకుడిని కనిపెట్టడంతో సహాయం చేసే పోలీస్ కమిషనర్ పాత్రలో శ్రీకాంత్ ఎప్పటిలాగే రాణించాడు. తన సీనియారిటీతో ఆ పాత్రను అలవోకగా చేసేశాడు. ఇక సినిమాకి ఎంతో కీలమైన ఆర్యన్ దేవ్ పాత్రలో భరత్ మెప్పించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మైమ్ గోపి, కబీర్ సింగ్, మౌనిక రెడ్డి తదితరులు పాత్రల పరిధి మేరకు రాణించారు.

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
మలయాళ ఫిల్మ్ 'ముంబై పోలీస్' చూడనివారిని ఈ చిత్రం కొంతవరకు ఆకట్టుకోవచ్చు. ముఖ్యంగా ఊహకందని క్లైమాక్స్ బిగ్ సర్ ప్రైజ్ లా అనిపించొచ్చు. అయితే క్లైమాక్స్ వరకు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేసి, సినిమాలో పూర్తిగా లీనమయ్యేలా చేయడంలో 'హంట్' పూర్తిస్థాయిలో విజయం సాధించలేదనే చెప్పాలి.

రేటింగ్: 2.5/5 

-గంగసాని

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.