కృష్ణ సరసన గోపికలు ఎందరైనా అగ్ర స్థానం విజయనిర్మలదే!
on Nov 15, 2022

నటశేఖర్ కృష్ణ 344 సినిమాల్లో హీరోగా నటించారు. వాటన్నింటిలో కలిపి ఆయన 70కి పైగా హీరోయిన్లతో జతకట్టారు. అయితే వారందరిలోనూ తన నిజ జీవిత భాగస్వామి విజయ నిర్మలతోనే ఎక్కువ సినిమాల్లో నటించారు కృష్ణ. ఆ ఇద్దరూ జంటగా 50 సినిమాల్లో నటించారు. కృష్ణ నట జీవితాన్నీ, నిజ జీవితాన్నీ మలుపుతిప్పిన బాపు సినిమా 'సాక్షి'లో తొలిసారి ఆ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా చేశారు.
1969లో కృష్ణ, విజయనిర్మల పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ అది రెండో పెళ్లే. 1970లో కృష్ణ సినిమాలు 15 విడుదలైతే, వాటిలో 11 సినిమాల్లో విజయనిర్మల హీరోయిన్! వారి ప్రేమ వ్యవహారం, పెళ్లయిన తర్వాత కూడా వారిద్దరూ జంటగా కలిసి నటించడం జనానికి మహా ఆసక్తిగా ఉండేది. ప్రపంచ సినిమాలో భార్యాభర్తలు కలిసి హీరో హీరోయిన్లుగా ఇన్ని సినిమాలు చేసిన దాఖలా మరెక్కడా కనిపించదు.
విజయనిర్మలలో దర్శకురాలు కావాలనే కోరికను గుర్తించి ప్రోత్సహించారు కృష్ణ. ఆమె దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం 'మీనా'. అందులోనూ కృష్ణ, విజయనిర్మల జోడీగా నటించారు. ఆ నవలా చిత్రం సూపర్ హిట్ కావడం ఆ రియల్ లైఫ్ పెయిర్‌కు మరపురాని మధురానుభూతిని కలిగించింది. ఆ ఉత్సాహంతోనే 'దేవదాసు' పాత్రలో తన భర్తను చూసుకోవాలని విజయనిర్మల ఉవ్విళ్లూరారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు కానీ, పాటలు మాత్రం సూపర్ పాపులర్ అయ్యాయి.
బ్లాక్‌బస్టర్ మూవీ 'అల్లూరి సీతారామరాజు'లో సీత పాత్రలో విజయనిర్మల నటించారు. ఆ మూవీ తర్వాత కృష్ణ నటించిన 17 సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి. మళ్లీ కృష్ణను సక్సెస్ ట్రాక్‌లోకి తెచ్చిన 'పాడిపంటలు' చిత్రంలో హీరోయిన్ విజయనిర్మల.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



