నువ్వు ఏ పనైనా చెయ్... కానీ రైతుగా కూడా ఉండు అంటున్న కార్తి
on Jan 28, 2023
నువ్వు ఏ పనైనా చెయ్... కానీ రైతుగా కూడా ఉండు అని అంటున్నారు హీరో కార్తీ . తన ఉళవన్ ఫౌండేషన్ తరపున ఉత్తమ రైతులకు అవార్డులు అందించారు. కార్తీ మాట్లాడుతూ ``నేను ఉళవన్ ఫౌండేషన్ ని మొదలు పెట్టినప్పుడు రైతుల గురించి, వ్యవసాయం గురించి పూర్తిగా తెలుసుకుందాం అనుకున్నాను. కానీ ఆ దిశగా ప్రయాణం చేస్తుండగా నాకు చాలా విషయాలు కొత్తగా అనిపించాయి. రైతుల పట్ల గౌరవం రైతులకు సంబంధించిన విషయాల మీద అవగాహన సొసైటీలో చాలా తక్కువగా ఉందనిపించింది. నిజానికి రైతులే మన కథానాయకులు. మనం మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నామంటే వాళ్లే కారణం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈ విషయాన్ని మా ఉళవన్ ఫౌండేషన్ తరపున గుర్తించి ఉత్తమ రైతులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే అందిస్తున్నాం`` అని అన్నారు.
భావితరాలకు రైతుల గురించి అవగాహన కల్పించాలని చెబుతూ `` మనలో చాలామంది పిల్లలకు భోజనాన్ని వృధా చేయకూడదు అనే విషయాన్ని చెబుతాం. కానీ భోజనం మన ప్లేట్లోకి రావడానికి అహర్నిశలు కష్టపడే రైతుల గురించి ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నాం? అన్నది కూడా ఆలోచించాలి. పాఠశాలల్లోనూ రైతులకు సంబంధించిన విషయాలను పిల్లలకు ఏమేర నేర్పుతున్నారనే విషయం మీద ఫోకస్ పెంచాలి. పిల్లలను ఫీల్డ్ ట్రిప్పులు తీసుకెళ్లేటప్పుడు తప్పకుండా పొలాల్లోకి తీసుకెళ్లేలా ఉపాధ్యాయులు ప్లాన్ చేసుకోవాలి.
మన పూర్వీకులు, మన తండ్రులు ఇష్టంగా చేసిన వ్యవసాయం గురించి నెక్స్ట్ జనరేషన్ కు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. రైతుల పట్ల మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించేలా పిల్లలకు బుద్ధి నేర్పాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఒక డాక్టర్ కి, ఒక ఇంజనీర్ కి, ఒక కలెక్టర్ కి ఇస్తున్న గౌరవం వాళ్ళందరికీ అన్నం పెడుతున్న రైతుకు కూడా ఇచ్చేలా మనం ఈ సొసైటీని తయారు చేయాలి. అందుకే మా ఫౌండేషన్ తరపున మేము ప్రతి ఏటా రైతులకు అవార్డులు అందిస్తున్నాం`` అని అన్నారు కార్తీ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
