ఆకట్టుకుంటున్న 'హనుమాన్' టీజర్.. 'ఆదిపురుష్'ని మించేలా వీఎఫ్ఎక్స్!
on Nov 21, 2022

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'. సూపర్ హీరో ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్ర టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొన్ని కారణాల పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ టీజర్ ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తాజాగా విడుదలైన 'హనుమాన్' టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విజువల్స్ బాగున్నాయి. ప్రశాంత్ వర్మ తన బడ్జెట్ పరిధిలో చాలా మంచి అవుట్ పుట్ ఇవ్వబోతున్నాడని టీజర్ ని బట్టే అర్థమవుతోంది. టీజర్ కి సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలిచాయి. టీజర్ చివరిలో హనుమంతుడు మంచు లింగంలో కూర్చొని 'రామ్' అంటూ ధ్యానం చేస్తున్న షాట్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. 'ఆదిపురుష్' వంటి భారీ బడ్జెట్ మూవీ టీజర్ తో పోల్చితే 'హనుమాన్' టీజర్ లో వీఎఫ్ఎక్స్ చాలా మెరుగ్గా ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ , వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ మొదలైంది. ప్రశాంత్ వర్మ సైతం తనదైన సినీ ప్రపంచం సృష్టించబోతున్నాడు. తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా 'హనుమాన్' వస్తోంది. ఆ తర్వాత 'అధీర' రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



