గద్దర్ నటించిన చివరి చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం'
on Aug 6, 2023
ప్రజా గాయకుడు గద్దర్(74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజా యుద్ధనౌక గా పేరు పొందారు. తన పాటలతో దళితుల గళాన్ని, తెలంగాణా వాదాన్ని బలంగా వినిపించారు. గద్దర్ రాసిన పాటల్లో 'అమ్మ తెలంగాణమా' అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు గద్దర్. 'మాభూమి' సినిమాలోని 'బండెనక బండి కట్టి' అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించారు. 'ఒరేయ్ రిక్షా' చిత్రంలోని 'నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ' అనే పాటకు సాహిత్యం అందించారు. ఇక 'జై బోలో తెలంగాణ' సినిమాలో 'పొడుస్తున్న పొద్దు మీద' పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఇలా పాటలు పాడటం, రాయడమే కాకుండా అప్పుడప్పుడు వెండితెర మీద కనువిందు చేశారు గద్దర్. ఆయన నటించిన చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం'.
సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం'. అప్పట్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ సాధన కోసం జరిగిన పోరాటం మరియు ఈనాడు పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో గద్దర్ కీలక పాత్ర పోషించడమే కాకుండా పాటలు కూడా రాసారు. గద్దర్ మరణవార్త తెలుసుకున్న ఈ చిత్ర బృందం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ "ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆయన నటించిన చివరి చిత్రం ఇదే. ఇటీవల రీ రికార్డింగ్ పనుల్లో పాల్గొన్నారు. ఆయన మరణించడం బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.
జనం ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పల్సర్ బైక్ ఝాన్సీ కథానాయికగా పరిచయం అవుతోంది. వైజాగ్ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మేఘన, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ కోటి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో గద్దర్ తో పాటు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ కూడా పాటలు రాయడం విశేషం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
